ఏపీ ప్రభుత్వం బనకచర్ల ప్రాజెక్టుపై ముందుకెళ్తుంటే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), నీటిపారుదలశాఖ మంత్రి ఏం చేస్తున్నారని మాజీ మంత్రి హరీశ్‌రావు(Harish Rao) ప్రశ్నించారు. తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ఉద్యమ ట్యాగ్‌లైన్‌లో నీళ్లే మొదటి అంశమని.. నీళ్ల విషయంలో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదని మండిపడ్డారు. బనకచర్ల ద్వారా రాయలసీమకు నీళ్లు తరలించే ప్లాన్ జరుగుతోందన్నారు. బనకచర్లతో తెలంగాణకు తీవ్ర నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. బనకచర్ల ద్వారా రాయలసీమకు 200 టీఎంసీలు తరలించాలని చూస్తుంటే ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించార.
పోలవరం ప్రాజెక్టు కూడా నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్నారని ఆరోపించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే అప్పటి ప్రభుత్వం గోదావరి జలాల్లో 968 టీఎంసీలను తెలంగాణకు కేటాయించిందని గుర్తు చేశారు. అదే గోదావరి బేసిన్‌లో తెలంగాణలోని సీతమ్మసాగర్ లిఫ్ట్ ఇరిగేషన్, సమ్మక్క సాగర్ ప్రాజెక్టు, కాళేశ్వరం మూడో టీఎంసీ, డాక్టర్ అంబేడ్కర్ వార్దా ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. బనకచర్లపై ఏపీ ముందుకెళ్తుంటే సీఎం సలహాదారు ఏం చేస్తున్నారు? అని నిలదీశారు. గోదావరి బేసిన్‌లో మనకు హక్కుగా రావాల్సిన నీళ్లపై అడగట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏపీ సీఎస్‌గా పనిచేసిన ఆదిత్యనాథ్ దాస్‌ను సలహాదారుగా పెట్టుకున్నారని విమర్శించారు. సలహాదారుగా పెట్టుకునేందుకు ఇంకెవ్వరూ దొరకలేదా? అని ధ్వజమెత్తారు. సీఎం రేవంత్ రెడ్డి ఏమైనా చంద్రబాబు(Chandrababu)కు గురుదక్షిణ చెల్లిస్తున్నారా? అని అనుమానం వ్యక్తం చేశారు. తుంగభద్రలోనూ గండికొట్టేందుకు ఏపీ, కర్ణాటక యత్నిస్తున్నాయని.. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని ఆయన ఫైర్ అయ్యారు