AEE Remand: తెలంగాణలో మరో అవినీతి చేప ఏసీబీ అధికారులకు దొరికింది. నీటిపారుదల శాఖలో ఏఈఈగా పనిచేస్తున్న నిఖేశ్ కుమార్‌ను ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్ట్ చేశారు. అనంతరం ఆయనను ఏసీబీ కోర్టు న్యాయమూర్తి నివాసంలో హాజరుపరిచారు. దీంతో డిసెంబర్ 13వ తేదీ వరకు రిమాండ్ విధిస్తూ తీర్పు ఇచ్చారు. న్యాయమూర్తి తీర్పుతో నిఖేశ్‌ను చంచల్ గూడ జైలుకు తరలించారు.
రంగారెడ్డి జిల్లా నీటిపారుదల శాఖ ఏఈఈగా పనిచేస్తున్న నిఖేశ్ భారీగా సంపాదించినట్లు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు అందింది. దీంతో రంగంలోకి దిగిన అధికారులు రెండు రోజుల పాటు ఆయన ఇంటితో పాటు బంధువుల నివాసాల్లో సోదాలు జరిపారు. ఈ సోదాల్లో దాదాపు రూ.200 కోట్ల మేర అక్రమ ఆస్తులను గుర్తించారు. దీంతో అతడిని అదుపులోకి తీసుకున్నారు.
కాగా గతంలోనూ నిఖేశ్‌పై పలు ఫిర్యాదులు అందాయి. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లోని బఫర్ జోన్లలో నిర్మాణాలకు అడ్డగోలుగా అనుమతులు ఇస్తూ కోట్ల రూపాయాలు కూడబెట్టారని తెలుస్తోంది.