CM Revanth Reddy| గతేడాది నిర్వహించిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు నేటితో ఏడాది పూర్తి కావడంతో సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్ చేశారు. 2023, నవంబర్ 30న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే.
“ఏడాది క్రితం సరిగ్గా ఇదే రోజు… పొలానికి వెళ్లి అరక కట్టాల్సిన రైతు…పోలింగ్ బూతుకు వెళ్లి “మార్పు” కోసం ఓటేశాడని గుర్తు చేశారు. ఆ ఓటు అభయహస్తమై…రైతన్న చరిత్రను తిరగరాసింది. ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ…రూ.7,625 కోట్ల రైతు భరోసా…ధాన్యానికి క్వింటాల్‌కు రూ.500 బోనస్…రూ.10,444 కోట్ల ఉచిత విద్యుత్…రూ.1433 కోట్ల రైతుబీమా…రూ.95 కోట్ల పంట నష్ట పరిహారం…రూ.10,547 కోట్ల ధాన్యం కొనుగోళ్లకు దారి తీసింది. ఒక్క ఏడాదిలో 54 వేల కోట్ల రూపాయలతో…రైతుల జీవితాల్లో పండగ తెచ్చాం. ఇది నెంబర్ కాదు…రైతులు మాపై పెట్టుకున్న నమ్మకం. ఈ సంతోష సమయంలో…అన్నదాతలతో కలిసి…రైతు పండుగలో పాలు పంచుకోవడానికి…ఉమ్మడి పాలమూరుకు వస్తున్నా” అంటూ ఆయన వెల్లడించారు.
కాగా ఈ ఎన్నికల్లో ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోవడానికి పోటెత్తారు. డిసెంబర్ 3న విడుదలైన ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ 64 సీట్లతో అధికారంలోకి రాగా.. బీఆర్ఎస్ పార్టీ 39 సీట్లతో ప్రతిపక్షానికి పడిపోయింది.