IT professionals weekend farming : లక్షల్లో జీతాలు.. ఏసీ గదుల్లో కొలువులు.. చూసేవారికి ఐటీ ఉద్యోగమంటే ఓ వెలుగు. కానీ, ఆ కాంతి వెనుక అంతులేని పని ఒత్తిడి, టార్గెట్ల తలనొప్పి. ఈ ఒత్తిడి సుడిగుండం నుంచి బయటపడేందుకు నేటితరం టెక్కీలు ఓ కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. వారాంతం వస్తే చాలు.. కీబోర్డును పక్కనపెట్టి, నాగలి పడుతున్నారు. ఏసీ గదులను వీడి, పచ్చని పైరగాలితో దోస్తీ చేస్తున్నారు. అసలు ఈ మార్పుకు కారణమేంటి..? మట్టి వాసనలో వారు పొందుతున్న ఆ మానసిక ప్రశాంతత ఏమిటి..?
ఒత్తిడికి విరుగుడుగా సేద్యం : వారం మొత్తం కంప్యూటర్ స్క్రీన్ల ముందు కుస్తీ పట్టే ఐటీ ఉద్యోగులు, వీకెండ్ రాగానే పల్లెబాట పడుతున్నారు. హైదరాబాద్, పుణె వంటి మహానగరాల్లో పనిచేస్తున్న యువత, తమ సొంతూళ్లలోని పొలాల్లో సేదతీరుతున్నారు. కేవలం సేదతీరడమే కాదు, తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా ఉంటున్నారు. అరక దున్నడం, ట్రాక్టర్‌తో పొలాన్ని చదును చేయడం, యూరియా చల్లడం వంటి పనుల్లో పాలుపంచుకుంటున్నారు. ఇది తమకు పని ఒత్తిడి నుంచి గొప్ప ఉపశమనాన్ని ఇస్తోందని, మానసిక ప్రశాంతతను అందిస్తోందని వారు చెబుతున్నారు.
మారిన తరం.. మారని మట్టి బంధం : గతంలో తమ పిల్లలు ఉన్నత చదువులు చదివి, ఐటీ కొలువుల్లో స్థిరపడాలని ఎందరో తల్లిదండ్రులు ఉన్న పొలాలను అమ్మి మరీ చదివించారు. ఇప్పుడు అదే పిల్లలు, తమ లక్షల సంపాదనతో మళ్లీ భూములను కొనుగోలు చేసి, వ్యవసాయం వైపు మొగ్గుచూపడం విశేషం. కొందరు ఆ భూములను కౌలుకు ఇస్తుంటే, మరికొందరు తమ తల్లిదండ్రులతో కలిసి సేద్యం చేస్తున్నారు. కూలీలు ఉన్నప్పటికీ, తాము కూడా మట్టిని ముట్టుకోవాలన్న తపనతో పొలంలోకి దిగుతున్నారు.
ఆ అనుభూతే వేరు : “నేను పుణెలో ఐటీ ఉద్యోగిని. మాకు నాలుగెకరాల పొలం ఉంది. దాదాపు ప్రతి 15 రోజులకోసారి ఇంటికి వస్తాను. అమ్మతో కలిసి పొలం పనులే చూసుకుంటా. ట్రాక్టర్‌తో నేనే దున్నుతా, మందులు చల్లుతా. ఉద్యోగంలో ఒత్తిడి సహజం. దాని నుంచి బయటపడాలంటే పొలం పనులే శ్రేష్ఠం అని నా అభిప్రాయం.”
– రామాంజిరెడ్డి, ఐటీ ఉద్యోగి, మేళ్లచెరువు
వ్యవసాయమే కాదు.. ప్రత్యామ్నాయ ప్రశాంతత : పొలం పనులే కాకుండా, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కోసం ఐటీ ఉద్యోగులు ఇతర మార్గాలను కూడా అన్వేషిస్తున్నారు. లాంగ్ వీకెండ్స్ దొరికితే స్నేహితులతో కలిసి పర్యాటక ప్రాంతాలకు వెళ్తున్నారు. కొందరు నగర శివార్లలోని ఫామ్‌హౌస్‌లను అద్దెకు తీసుకుని ప్రకృతితో గడుపుతున్నారు. ట్రెక్కింగ్, మొక్కలు నాటడం, కొత్త ప్రదేశాలను అన్వేషించడం వంటి కార్యకలాపాలతో తమను తాము పునరుత్తేజం చేసుకుంటున్నారు.


