Malla reddy: తెలంగాణ కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి ఇంట్లో ఐటీ దాడులు నిర్వహిస్తుంది. మంగళవారం ఉదయం నుంచే మల్లారెడ్డి ఇల్లు, ఆఫీసులపై దాడులు మొదలు పెట్టారు. అలాగే, మల్లారెడ్డి కుమారుడు మహేందర్ రెడ్డి ఇళ్ళు, కార్యాలయాల్లో కూడా ఐటీ శాఖ దాడులు చేస్తోంది. కుమారుడికి చెందిన సికింద్రాబాద్ లోని గేటెడ్ కమ్యూనిటీలో ఐటీ సోదాలు చేస్తోంది. మంత్రి మల్లారెడ్డి అల్లుడి ఇంట్లోనూ సోదాలు చేస్తున్నారు.
ఇంకా హైదరాబాద్‌లో మల్లారెడ్డికి చెందిన బంధువుల ఇళ్లు, సంస్థల్లో కూడా తనిఖీలు జరుగుతున్నాయి. మొత్తం 50 బృందాలుగా వచ్చిన ఐటీశాఖ అధికారులు ఒక్కసారిగా ఈ దాడి చేశారు. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయనే సమాచారంతో ఐటీ అధికారులు ఈ సోదాలు చేస్తున్నారు. మల్లారెడ్డి కుటుంబంపైనే కాకుండా నగరంలోని పలువురి ప్రముఖుల ఇళ్లు, కార్యాలయాల్లో కూడా తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. కొంపల్లిలోని పాం మెడోస్ విల్లా, గేటెడ్ కమ్యూనిటీల్లో కూడా ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
మంత్రి మల్లారెడ్డి ఇల్లు, కార్యాలయాలపై ఐటీ దాడులు టీఆర్ఎస్ పార్టీలో కలకలం రేపుతోంది. ఈ మధ్యనే కరీంనగర్‌లో మంత్రి గంగుల కమాలకర్ ఇల్లు, కార్యాలయాల్లో ఈడీ, ఐటీ అధికారులు ఉమ్మడి సోదాలు నిర్వహించగా.. ఆ తర్వాత హైదరాబాద్‌లోని టీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ వద్దిరాజ్ రవిచంద్ర ఇంటిపై ఐటీ దాడులు జరిగాయి. ఇప్పుడు ఇలా మల్లారెడ్డి ఇంటిపై కూడా అటాక్ చేయడంతో నేతలలో కలకలంరేపుతోంది.