Friday, November 22, 2024
HomeతెలంగాణJadcharla: జడ్చర్లలో భూముల అన్యాక్రాంతంపై లోకాయుక్త విచారణ

Jadcharla: జడ్చర్లలో భూముల అన్యాక్రాంతంపై లోకాయుక్త విచారణ

కబ్జాదారుల గుండెల్లో దడ

జడ్చర్ల పట్టణ నడిబొడ్డున ఉన్న గాంధీ ట్రస్ట్ భూములతో పాటు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం భూముల అన్యాక్రాంతంపై లోకాయుక్త విచారణ చేపట్టింది. 1200 కోట్ల రూపాయల విలువైన జడ్చర్ల గాంధీ ట్రస్ట్ భూముల వ్యవహారంపై అనిల్ కుమార్ అనే సామాజిక కార్యకర్త లోకాయుక్తకు ఫిర్యాదు చేయడంతో లోకాయుక్త మెజిస్ట్రేట్ ప్రత్యేక విచారణ నిమిత్తం ప్రత్యేక వింగ్ ఏర్పాటు చేసింది.

- Advertisement -

విచారణ అధికారులుగా లోకాయుక్త డిప్యూటీ డైరెక్టర్ ముత్యంరావు, డీఎస్పీ విద్యాసాగర్ లను ప్రత్యేక విచారణ అధికారులుగా నియమించింది. లోకాయుక్త అధికారులు ముత్యంరావు, విద్యాసాగర్ లు గురువారం విచారణ కోసం జడ్చర్ల వచ్చారు. ముందుగా జడ్చర్ల తాహసిల్దార్ కార్యాలయంలో గాంధీ ట్రస్ట్, దేవాలయ భూముల సర్వే నెంబర్లను, పత్రాలను పరిశీలించారు. అనంతరం మహబూబ్ నగర్ ఆర్డిఓ నవీన్, జడ్చర్ల తహసిల్దార్ సత్యనారాయణ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ రాజయ్య, ఎండోమెంట్ అధికారిని వినదారి సంబంధిత శాఖల అధికారులతో విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా లోకాయుక్త అధికారి విద్యాసాగర్ మాట్లాడుతూ లోకాయుక్త ఆదేశాల మేరకు జడ్చర్ల పట్టణంలోని 30 ఎకరాల గాంధీ ట్రస్ట్ భూములను వాటి పత్రాలను పరిశీలించామని, 30 ఎకరాల భూమిలో ఎనిమిది ఎకరాల భూమి కనబడుతుందని, మిగతా భూమి ట్రస్టు పేరు మీదనే ఉందా లేక ఇంకెవరి పేరు మీద ఉందా అని విచారణ చేపడతామని తెలిపారు. అనంతరం దేవాలయ భూములను పరిశీలించి ఎండోమెంట్, మున్సిపల్ అధికారుల తీరుపై మండిపడ్డారు.

దేవాలయ భూముల్లో నిర్మాణాలు కట్టడాలను గుర్తించి, వాటిపై రీ సర్వే చేసి వారంలోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఇక్కడ విచారించిన అంశాలను, తాము గుర్తించిన అంశాలను లోకాయుక్త మెజిస్ట్రేట్ కు నివేదిక రూపంలో అందిస్తామని అధికారులు తెలిపారు. ఉన్నతమైన ఆశయాలతో 1951వ సంవత్సరంలో కావేరమ్మ పేట గ్రామానికి చెందిన వలకొండ బాలయ్య అనే సామాజికవేత్త తన సొంత డబ్బులతో 30 ఎకరాల 25 కుంటల భూమి కొనుగోలు చేసి జాతిపిత మహాత్మా గాంధీ పేరిట భావితరాల కోసం గాంధీ ట్రస్ట్ ఏర్పాటు చేశారు. ఈ భూమికి సంబంధించిన హక్కులన్నీ ట్రస్ట్ కు చెందేలా చేశారు. ఉన్నతమైన ఆశయాలతో ఏర్పడిన ట్రస్టులో ఉన్న భూమి నేడు అన్యాక్రాంతానికి గురవుతుందని అనిల్ కుమార్ అనే వ్యక్తి లోకాయుక్తను ఆశ్రయించడంతో కేసు నమోదు చేసుకున్న లోకాయుక్త కార్యచరణను మొదలుపెట్టింది. గాంధీ ట్రస్ట్ తో పాటు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ భూములు కూడా అన్యాక్రాంతానికి గురయ్యాయని ఫిర్యాదు అందుకున్న లోకాయుక్త అధికారులు వాటిపై కూడా విచారణ చేపట్టారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News