Monday, October 21, 2024
HomeతెలంగాణJadcharla: ముఖ్యమంత్రికి ఎమ్మెల్యే అనిరుధ్ లేఖ

Jadcharla: ముఖ్యమంత్రికి ఎమ్మెల్యే అనిరుధ్ లేఖ

ప్రభుత్వ ప్రతిష్ఠ కూడా..

ఈ ఏడాది చెరువులు, కుంటల్లో వేయడానికి గత ఏడాది ఇచ్చిన చేప పిల్లల సంఖ్యలో సగం మాత్రమే ఇస్తామని ప్రభుత్వం నిబంధన విధించి, ఆ ప్రకారంగానే చేప పిల్లలను సరఫరా చేయడం సమంజసం కాదని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి పేర్కొన్నారు. ఈ విధంగా చేయడం వల్ల చేపల ద్వారా ఉపాధి పొందే ముదిరాజ్ సామాజికవర్గానికి నష్టం కలుగుతుందని అభిప్రాయపడ్డారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి ఒక లేఖను రాసారు.

- Advertisement -

ఈ విషయం సోమవారం మీడియాకు విడుదల చేసిన ఒక ప్రకటనలో అనిరుధ్ రెడ్డి పూర్వాపరాలను వివరించారు. గత ఏడాది చెరువులకు సరఫరా చేసిన చేప పిల్లల సంఖ్యలో సగం మాత్రమే ఈ ఏడాది సరఫరా చేస్తున్నారనే విషయం తన దృష్టికి రావడంతో ఈ విషయంగా అధికారులను ప్రశ్నించానని, ఈ ఏడాది చెరువులు, కుంటల్లో చేప పిల్లలను విడుదల చేసే విషయంగా రాష్ట్ర ఫిషరీస్ డైరెక్టర్ మేమో నంబర్ సి ఎఫ్-సి/2/1/2024 డిడిఐఎన్డి, తేదీ 15.08.2024 జారీ చేశారని తెలిపారు. ఈ మెమో ప్రకారంగా రాష్ట్రంలో గత ఏడాది సరఫరా చేసిన చేప పిల్లల సంఖ్యలో ఈ ఏడాది 50 శాతం మాత్రమే సరఫరా చేయాలని ఆంక్షలు విధించారని చెప్పారు. దీని వల్ల గత ఏడాది లక్ష చేప పిల్లలు సరఫరా చేసిన చెరువులకు ఈ ఏడాది 50 వేల చేప పిల్లలను మాత్రమే మత్స్యశాఖ అధికారులు సరఫరా చేస్తున్నారని అనిరుధ్ రెడ్డి వివరించారు. తన నియోజకవర్గంలో పెద్దవైన నస్రుల్లాబాద్ చెరువుకు గతేడాది 1.20 లక్షల చేప పిల్లలను ఇస్తే ఈ ఏడాది 60 వేల చేప పిల్లలు మాత్రమే ఇచ్చారని, అలాగే మిడ్జిల్ చెరువుకు గతేడాది 60 వేల చేప పిల్లలను ఇవ్వగా ఈ ఏడాది దాన్ని 30 వేలకు తగ్గించేసారని ఉదహరించారు. గత ఏడాది కంటే ఈ ఏడాది వర్షాలు బాగా కురుస్తున్న ఈ ఏడాది వర్షాలు సరిగా కురవలేదంటూ ఫిషరీస్ డైరెక్టర్ తన మెమోలో సాకుగా చూపించి చేప పిల్లల సంఖ్యను సగానికి తగ్గించేయడం సమంజసం కాదని విమర్శించారు. దీని వల్ల ఈ ఏడాది చెరువుల్లో చేపల సంఖ్య సగానికి తగ్గి పోతుందని, ఈ చేపల వేటపై ఆధారపడి జీవించే ముదిరాజ్ కుటుంబాల ఆదాయం కూడా సగానికి తగ్గిపోతుందని అభిప్రాయపడ్డారు.

ఈ విధంగా చేప పిల్లల సంఖ్యను సగానికి తగ్గించేసి, ముదిరాజ్ కుటుంబాల ఆదాయాన్ని తగ్గించడం వల్ల ప్రభుత్వ ప్రతిష్ట కూడా దెబ్బ తింటుందని ఆందోళన వ్యక్తం చేసారు. అందుకే ఈ విషయంగా ముఖ్యమంత్రి కల్పించుకొని చెరువులు, కుంటలకు గత ఏడాది ఏ స్థాయిలో చేప పిల్లలను ఇచ్చారో, అదే స్థాయిలో ఈ ఏడాది కూడా చేప పిల్లలను సరఫరా చేయడానికి వెంటనే చర్యలు తీసుకోవాలని అనిరుధ్ రెడ్డి కోరారు. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆయన ఒక లేఖను రాశారు. ఈ విషయాన్ని పరిశీలించి వెంటనే చర్యలు తీసుకోవాలని సీఎంను విజప్తి చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News