హిందుత్వానికి ఏ ఒక్కరో ఛాంపియన్ కాదని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు. హిందుత్వాన్ని రాజకీయాలలోకి దూర్చి కొందరు హిందుత్వ గౌరవాన్ని దిగజారుస్తున్నారని ఆయన మండిపడ్డారు. చెట్టుపేరు చెప్పుకుని కాయలు అమ్మే వారు ఇటువంటి కుట్రలకు తెర లేపుతున్నారని ఆయన దుయ్యబట్టారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని వేద పాఠశాల ప్రాంగణంలో
తెలంగాణా వైదిక బ్రాహ్మణ సంఘం, దేవాలయ దీప, ధూప మత్తైక అర్చక ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో శ్రీశ్రీశ్రీ శోభాక్రుత్ కాల నిర్ణయ పంచాంగాన్ని మంత్రి జగదీష్ రెడ్డి ఆవిష్కరించారు.
అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ భారతీయ విలువలు అంటేనే హిందుత్వానికి ప్రతీక అని ఆయన కొనియాడారు. వేల సంవత్సరాల నుండే ఇది విరాజిల్లుతుందన్నారు. మానవ సమాజం మొదలైన రోజు నుండే భారతదేశంలో విలువలకు పెద్ద పీట వేస్తున్నారన్నారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తొలినాళ్లలో ఇక్కడ వేదపాఠశాల నెలకొల్పడం జరిగిందన్నారు. శాశ్వతమైన భవనాన్ని నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందిస్తామన్నారు.