Jagga Reddy fire on KTR: రాహుల్ గాంధీపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి తీవ్రంగా ఖండించారు. రాహుల్‌కు విజన్ లేదంటూ కేటీఆర్ వ్యాఖ్యానించడం దారుణమని ఆయన పేర్కొన్నారు. రాహుల్ గాంధీని విమర్శించే స్థాయి కేటీఆర్‌కు లేదని అన్నారు. రాహుల్ వ్యక్తిత్వాన్ని ప్రశ్నించే నైతిక హక్కు బీఆర్‌ఎస్ నేతలకు లేదని జగ్గారెడ్డి ఘాటుగా వ్యాఖ్యానించారు.
కేసీఆర్ కుటుంబానిది స్వార్థ పోరాటం: రాహుల్ గాంధీ ఎంత గొప్ప వ్యక్తి అనేది కేటీఆర్‌కు తెలియదని జగ్గారెడ్డి అన్నారు. తన మాటలు వింటే రాహుల్ గొప్పతనం తెలుస్తుందని వ్యాఖ్యానించారు. కేసీఆర్ కుటుంబం తమ స్వార్థం కోసం మాత్రమే పోరాటం చేసిందని జగ్గారెడ్డి ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో సోనియా గాంధీ కుటుంబం పాత్రను జగ్గారెడ్డి గుర్తు చేశారు. ఆ కుటుంబం తెలంగాణ ఇస్తేనే మీ కుటుంబసభ్యులు ముఖ్యమంత్రి అయ్యారని కేటీఆర్‌ను ఉద్దేశించి జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు.
తెలంగాణ కల్చర్ మరిచిన కేటీఆర్: ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ నష్టపోతుందని తెలిసినా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన గొప్పకుటుంబం సోనియా గాంధీదని జగ్గారెడ్డి అన్నారు. కాంగ్రెస్ అధికారం కోసం నిర్ణయాలు తీసుకోలేదని అన్నారు. మీలా మాట ఇచ్చి తప్పుకునే కుటుంబం రాహుల్‌ది కాదని అన్నారు. ఇప్పటికైనా ఆ కుటుంబం గురించి మాట్లాడే ముందు జాగ్రత్తగా మాట్లాడాలని కోరారు. జగ్గారెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య మరోసారి మాటల యుద్ధానికి దారితీసే అవకాశం ఉంది.

