Jagtial land encroachment : వివాదంలో ఉందా? అయితే ఆ భూమి బంగారంతో సమానం! ఇదే ఇప్పుడు జగిత్యాల జిల్లాలోని కొందరు స్థిరాస్తి వ్యాపారుల కొత్త దందా. సామాన్యుల బలహీనతను ఆసరాగా చేసుకుని, అధికారుల అండతో వివాదాస్పద భూములను చౌకగా కొట్టేసి, అమాంతం ధరలు పెంచి జేబులు నింపుకుంటున్నారు. అసలు ఈ భూ మాయాజాలం వెనుక ఎవరున్నారు..? అడ్డదారుల్లో రిజిస్ట్రేషన్లు ఎలా జరుగుతున్నాయి? అమాయకులు ఎలా నష్టపోతున్నారు..?
భూమికి రెక్కలొచ్చినట్లు ధరలు ఆకాశాన్నంటుండటంతో, జగిత్యాల జిల్లాలో కొందరు స్థిరాస్తి వ్యాపారులు, రాజకీయ నాయకుల కన్ను వివాదాస్పద భూములపై పడింది. కుటుంబ కలహాలు, కోర్టు కేసులతో సతమతమవుతున్న యజమానుల నుంచి ఆ భూములను చౌకగా దక్కించుకుంటున్నారు. ఆ తర్వాత తమ పలుకుబడితో సమస్యలను పరిష్కరించి, అదే భూమిని నాలుగైదు రెట్లు అధిక ధరకు విక్రయిస్తూ కోట్లు గడిస్తున్నారు. గతంలో క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు పెట్టి నష్టపోయి స్థిరాస్తి వ్యాపారం మందగించడంతో, ఇప్పుడు ఈ కొత్త తరహా దందాకు తెరలేపారు.
రాజధానిలో రూ.15 కోట్ల పెట్టుబడి గల్లంతు: ఈ దందా కేవలం జిల్లాకే పరిమితం కాలేదు. జగిత్యాల జిల్లా మల్యాల మండలానికి చెందిన పలువురు ప్రముఖులు, స్థిరాస్తి వ్యాపారులు కలిసి హైదరాబాద్ శివార్లలోని ఓ వివాదాస్పద భూమిపై కన్నేశారు. రూ.90 కోట్ల విలువైన ఆ భూమిని అతి తక్కువ ధరకే ఇప్పిస్తానని ఓ మధ్యవర్తి నమ్మబలకడంతో, ఏకంగా రూ.15 కోట్లను పెట్టుబడిగా సమర్పించుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. అయితే, డబ్బులు చేతికి అంది నెలలు గడుస్తున్నా, అటు భూమి దక్కక, ఇటు ఇచ్చిన నగదు తిరిగి రాక బాధితులు లబోదిబోమంటున్నారు.
దాడులు, బెదిరింపులతో దందాలు: భూ యజమానులకు తెలియకుండానే కొందరు వ్యాపారులు, నాయకులు రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖల్లోని అధికారులను మచ్చిక చేసుకుని అడ్డదారుల్లో రిజిస్ట్రేషన్లు చేయించుకుంటున్నారు. ఈ విషయం బయటకు తెలియడంతో గ్రామాల్లో గొడవలు, ఘర్షణలకు దారితీస్తోంది. భూములను కాజేసేందుకు ఈ ముఠాలు బ్లాక్‌మెయిలింగ్, బెదిరింపులు, భౌతిక దాడులకు సైతం వెనకాడటం లేదని బాధితులు ఆరోపిస్తున్నారు.
ప్రభుత్వ భూములకూ ఎసరు: ప్రైవేట్ భూములే కాదు, ప్రభుత్వ స్థలాలనూ వదలడం లేదు. జిల్లాలోని రాజారం శివారు నుంచి దొంగల మర్రి వరకు ఎక్కడ ప్రభుత్వ భూమి కనిపించినా కబ్జా చేస్తున్నారు. రాత్రికి రాత్రే హద్దులు ఏర్పాటు చేస్తున్నారు. రాజారం, బల్వంతాపూర్, కొండగట్టు, ముత్యంపేట, నూకపల్లి శివార్లలోని విలువైన ప్రభుత్వ భూములను ఆక్రమించి, ఎవరికీ అనుమానం రాకుండా వాటిలోనే వ్యవసాయం చేస్తూ తమవిగా చిత్రీకరించుకుంటున్నారు.
ఇంటి నంబర్లతో మాయ: ఈ కబ్జాలకు చట్టబద్ధత కల్పించేందుకు కొందరు అక్రమార్కులు కొత్త ఎత్తుగడలు వేస్తున్నారు. ముందుగా ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుని, స్థానిక పంచాయతీల నుంచి దానికి ఇంటి నంబరును పొందుతున్నారు. ఆ ఇంటి నంబరు పత్రం ఆధారంగా సదరు భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారు. ప్రభుత్వ భూమికి సంబంధించిన అసలు సర్వే నంబరును కాకుండా, పక్కనే ఉన్న మరో ప్రైవేట్ సర్వే నంబరుతో రిజిస్ట్రేషన్ చేయిస్తూ అధికారుల కళ్లుగప్పుతున్నారు.
కొండగట్టు ప్రాంతంలో జరుగుతున్న ఈ భూ ఆక్రమణలపై స్థానికులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు శూన్యమని వాపోతున్నారు. ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు స్పందించి, ప్రభుత్వ భూములను సర్వే ద్వారా గుర్తించి, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి పరిరక్షించాలని ప్రజలు కోరుతున్నారు.


