తను ఎంత ఎత్తుకు ఎదిగినా సొంత ఊరిని, ఊరి ప్రజలను మర్చిపోకుండా తనకు వీలైన సహాయం చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు ఓ ఐఏఎస్అధికారి. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండల పరిధిలోని ఆబాది జమ్మికుంట గ్రామానికి చెందిన దొడ్డె ఆంజనేయులు, ప్రస్తుతం జార్ఖండ్ రాష్ట్రంలో డుంకా జిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్నారు. రెండు రోజుల క్రితం జమ్మికుంట పట్టణ పరిధిలోని కొత్తపల్లి గ్రామానికి చెందిన షహీద అను ఒంటరి మహిళ తన కొడుకు తీవ్ర అనారోగ్యం పాలు కావడంతో వైద్యం చేయించడానికి ఆర్థిక స్థోమత లేక దాతల సహాయం కోరింది. ఈ విషయానికి సంభందించిన వార్త కథనాలు, సోషల్ మీడియా పోస్టింగ్స్ చూసి, విషయం తెలుసుకున్న కలెక్టర్ ఆమెకు సాయం అందించేందుకు చొరవ చూపారు. ఆంజనేయులు వెంటనే స్పందించి 25,000 వేల రూపాయలను సహాయం కోసం ఎదురు చూస్తున్న బాధితుని తల్లి బ్యాంక్ అకౌంట్ కు పంపి, తన దాతృత్వం చాటుకున్నారు. తన కొడుకు వైద్య కోసం, ఆర్థిక సహాయం అంద చేసిన కలెక్టర్, దొడ్డే ఆంజనేయులుకు తల్లి షహీద కృతజ్ఞతలు తెలిపారు. తన కొడుకు ప్రాణాలను కాపాడు కోగలనన్న ధైర్యం కలిగిందని, తన బిడ్డ వైద్య ఖర్చులకు సహాయం చేస్తున్న దాతలకు ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు.