రాష్ట్ర ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి ప్రయాణిస్తున్న కారుకు శంకరపట్నం మండలం తాడికల్ సమీపంలో ద్విచక్ర వాహనం అడ్డు రావడంతో డ్రైవర్ అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పింది. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా సోమవారం సురక్ష దినోత్సవం పురస్కరించుకొని హుజురాబాద్ పట్టణంలో ఏర్పాటు చేసిన 2కే రన్ కార్యక్రమంలో పాల్గొనేందుకు సోమవారం ఉదయం కరీంనగర్ నుండి హుజురాబాద్ కు వస్తున్న ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి ప్రయాణిస్తున్న కారుకు తాడికల్ గ్రామ సమీపంలో ద్విచక్ర వాహనం అడ్డు రావడంతో కార్ డ్రైవర్ ప్రమాదాన్ని తప్పించబోయి రోడ్డు పక్కనే ఉన్న చెట్టును ఢీకొట్టాడు. వాహనంలో ఉన్న బెలూన్లు ఓపెన్ కావడంతో ఎమ్మెల్సీ తో సహా అందులో ప్రయాణిస్తున్న వారికి పెను ప్రమాదం తప్పింది. అక్కడి నుంచి ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి మరో కారులో హుజురాబాద్ కు చేరుకొని 2కే రన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. బైక్ పై వెళ్తున్న వ్యక్తికి స్వల్ప గాయాలు కాగా 108 వాహనంలో హుజురాబాద్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.
అందరిలో ఆందోళన…..
2కె రన్ కార్యక్రమంలో పాల్గొనేందుకు ముఖ్యఅతిథిగా హాజరవుతాడని ఎదురుచూస్తున్న అధికారులకు, నాయకులకు ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదానికి గురైందని తెలవడంతో ఒక్కసారిగా ఆందోళన నెలకొంది. ఎవరు ఆందోళన చెందవద్దని తనకు ఏమి జరగలేదని కార్యక్రమంలో పాల్గొనడానికి వస్తున్నానని సమాచారం అందించిన కౌశిక్ రెడ్డి అందరిలో ఉత్సవాన్ని నింపేందుకు ప్రమాద స్థల నుండి నేరుగా 2కే రన్ లో పాల్గొని అందరినీ చిరునవ్వుతో పలకరిస్తూ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి హెల్త్ చెకప్ చేయించుకున్నారు.