గ్రామీణ ప్రాంతాల్లో చేపడుతున్న అభివృద్ధి పనులను, గ్రామాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పని చేయాలని రాష్ట్ర ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ పార్టీ హుజురాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. జమ్మికుంట ఎంపీడీవో కార్యాలయంలో బుధవారం ఎంపీపీ దొడ్డ మమత అధ్యక్షతన నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశానికి ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ… వర్షాకాలం నేపథ్యంలో గ్రామాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారంపై స్థానిక ప్రజాప్రతినిధులు సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి సారించి సదరు సమస్యలను పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. మండల పరిధిలో మహిళా సంఘ భవనాలకు కేటాయించిన స్థలాలలో మహిళా సంఘ భవనాలను గుత్తేదారులతో త్వరితగతిన పూర్తి చేయించేందుకు ప్రత్యేక చొరవ చూపాలని స్థానిక ప్రజాప్రతినిధులకు సూచించారు. రైతాంగానికి విద్యుత్ సమస్యలు తలెత్తకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు.
గ్రామాలలో అసంపూర్తిగా ఉన్న మురుగు కాలువల, రహదారుల నిర్మాణ పనులను పూర్తి చేసేందుకు ఆర్ అండ్ బి అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతాంగ సంక్షేమానికి ప్రత్యేక దృష్టి సారించి సాగునీరుకు ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు కాలువల ద్వారా కాలేశ్వరం నీరును అందించేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. దీంతో నియోజకవర్గం పరిధిలోని ఒక లక్ష 15 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు. గ్రామాల్లో ఎలాంటి సమస్యలు ఉన్న సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేస్తూ సదరు సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు. సర్వసభ్య సమావేశంలో మండలంలోని అంకుశాపూర్, శంభునిపల్లి గ్రామాలలో ఇటీవల నూతన రహదారుల నిర్మాణం చేపట్టిన సమయంలో విద్యుత్ స్తంభాలు రహదారి మధ్యలోనే ఉండడంతో వాహనదారులకు ప్రమాదం పొంచి ఉందని వాటిని రహదారి ప్రక్కకు తరలించేందుకు అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ సర్పంచులు సమావేశం దృష్టికి తీసుకురాగా ఆర్ అండ్ బి, విద్యుత్ శాఖ అధికారులు సమన్వయంతో పనిచేసి సదరు సమస్యలను పరిష్కరించాలని జెడ్పిటిసి సభ్యుడు శ్రీరామ్ శ్యామ్ అధికారులకు సూచించారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించుకునేందుకు మండల సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుందని ప్రజాప్రతినిధులు సమావేశం దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు సంబంధిత అధికారులు అవసరమైన చర్యలు చేపట్టాలని ఎంపీపీ మమత అన్నారు. ఈ కార్యక్రమంలో జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కల్లపల్లి రాజేశ్వరరావు, తాహసిల్దార్ బండి రాజేశ్వరి, ఎంపీడీవో కల్పన, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, పలు ప్రభుత్వ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.