తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించి ప్రైవేటు ఆసుపత్రులకు దీటుగా ప్రభుత్వ ఆసుపత్రులలో వైద్య సేవలు అందించేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నారని, మనుషుల ప్రాణాలను నిలబెట్టడంలో వైద్యులు చేసే సేవలు అనిర్వచనీయమని ప్రభుత్వ విప్ పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. జమ్మికుంట పట్టణంలోని శంకర్ నందన గార్డెన్ లో తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా హుజురాబాద్ నియోజకవర్గ స్థాయి వైద్య సిబ్బందితో వైద్య దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బంది మోత్కుల గూడెం చౌరస్తా నుంచి శంకర్ నందన గార్డెన్ వరకు బతుకమ్మ, బోనాలతో డప్పు చప్పుళ్ల మధ్య నృత్యాలు చేస్తూ భారీ ర్యాలీని నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ హుజురాబాద్ నియోజకవర్గంలో 2014 నుండి ఇప్పటి వరకు 24 వేల 153 డెలివరీలు చేయడంతో పాటు ప్రతి ఒక్కరికి కెసిఆర్ కిట్ అందించామన్నారు.
సుమారు 7 కోట్ల 90 లక్షల 30 వేల రూపాయలు మగ ,ఆడ, పిల్లలు పుట్టిన తల్లిదండ్రులకు అందించామన్నారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత ప్రవేట్ ఆసుపత్రుల కంటే ప్రభుత్వ ఆసుపత్రులలో సకల సౌకర్యాలు కల్పించామన్నారు. హుజరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిని రూ,10 కోట్లతో, జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రిని రూ,5 కోట్లతో, కమలాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి రూ,మూడు కోట్ల 90 లక్షలు కేటాయించి అభివృద్ధి చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసిఆర్ కు దక్కుతుందన్నారు. హుజరాబాద్ ఆసుపత్రిలో డయాలసిస్ సేవలు ప్రారంభించినప్పటి నుండి అనేక మంది సుదూర ప్రదేశాలకు వెళ్లకుండా హుజురాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారన్నారు. హుజరాబాద్ నియోజకవర్గంలో కంటి వెలుగు కార్యక్రమం ద్వారా 10 లక్షల 18900 మందికి కంటి పరీక్షలు నిర్వహించామన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేస్తామని, దీంతో దేశంలోని రాష్ట్రాలన్నీ తెలంగాణ వైపు చూస్తున్నాయని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రజారోగ్యమే పరమావధిగా భావిస్తూ ప్రభుత్వ ఆస్పత్రులను బలోపేతం చేస్తున్న తీరు విమర్శకులు సైతం ప్రశంసలు కురిపించేలా ఉందన్నారు.
అనంతరం ఉత్తమ వైద్య సేవలు అందించిన వైద్య సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, హుజురాబాద్, జమ్మికుంట మున్సిపల్ చైర్మన్లు, గంధ రాధిక, తక్కలపల్లి రాజేశ్వరరావు హుజురాబాద్, వీణవంక ఎంపీపీలు రాణి సురేందర్ రెడ్డి, రేణుక తిరుపతిరెడ్డి, జడ్పిటిసి సభ్యులు శ్రీరామ్ శ్యామ్, ఆర్డిఓ హరి సింగ్, తహసిల్దార్ రాజేశ్వరి, కమిషనర్ శ్రీనివాస్, నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ ఆసుపత్రుల వైద్యులు, వైద్య సిబ్బంది, స్థానిక కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.