రాష్ట్ర ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి కరీంనగర్ నుండి హుజురాబాద్ కు కారులో వస్తుండగా శంకరపట్నం మండలం తాడికల్ గ్రామ సమీపంలో ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయి చెట్టును ఢీకొన్న విషయం విదితమే. పెను ప్రమాదం నుండి క్షేమంగా బయటపడిన కౌశిక్ రెడ్డి డాక్టర్ల సలహా మేరకు హుజరాబాద్ లోని తన ఇంటిలో విశ్రాంతి తీసుకుంటున్నాడు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా హుజరాబాద్ లో నిర్వహించిన మహిళా సంక్షేమ దినోత్సవానికి హాజరైన రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ సమావేశం అనంతరం కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లి ఆయనను పరామర్శించారు. ప్రమాద సంఘటన తీరును అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డిని పరామర్శించిన వారిలో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, కేడిసిసి ఉపాధ్యక్షులు పింగిలి రమేష్, జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కల్లపల్లి రాజేశ్వరరావు, జడ్పిటిసి సభ్యుడు శ్రీరామ్ శ్యామ్ తదితరులు ఉన్నారు.