ఎల్‌ఆర్‌ఎస్‌ను ఫీజు వెంటనే రద్దు చేయాలని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. జనగామ జిల్లా కేంద్రంలోని చౌరస్తా వద్ద బిఆర్ఎస్ నియోజకవర్గ పార్టీ ఆధ్వర్యంలో ఎల్ఆర్ఎస్ దరఖాస్తులకు ఉచితంగా ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతూ నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో వారు మాట్లాడుతూ ఎల్‌ఆర్‌ఎస్‌కు ఫీజులు వసూలు చేయడం ద్వారా రాష్ట్ర ప్రజల మీద తీవ్రమైన ఆర్థిక భారం మోపెందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైందని విమర్శించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఎల్‌ఆర్‌ఎస్ ఫీజు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఎల్‌ఆర్‌ఎస్‌ను ఉచితంగా చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మాట మార్చడం విడ్డూరం అని, గతంలో ఎల్‌ఆర్‌ఎస్ కోసం మా ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానించింది.కేవలం రూ.1000తో రిజిస్టర్ చేశాము. ఆ రోజు మమ్మల్ని తప్పుపడుతూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోర్టుకు వెళ్లారు.ఇప్పటి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారని, ఎవరూ ఎల్‌ఆర్‌ఎస్ కట్టొద్దని భట్టి పిలుపునిచ్చారని..ఉచితంగా భూములను రెగ్యులరైజ్ చేస్తామని ఉత్తమ్‌కుమార్ రెడ్డి చెప్పారని, నో ఎల్‌ఆర్‌ఎస్..నో బీఆర్ ఎస్ అని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారని పల్లా గుర్తు చేశారు. బీఆర్ ఎస్ పాలనలో ప్రతి విషయంపై కాంగ్రెస్ ఆరోపణలు చేసిందన్నారు. పేదల నుండి సొమ్ము దోచుకుంటున్నారని సీతక్క ఆనాడు అన్నారని, ఇప్పుడు ఎల్‌ఆర్ ఎస్ ఫీజుల వసూళ్లపై భట్టి, ఉత్తమ్, సీతక్క సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.ఉచితం అని ఇప్పుడు ప్రజల నుంచి రూ.20 వేల కోట్లు వసూలు చేయడానికి సిద్దపడ్డారు.దీని వల్ల 25 లక్షల పైచిలుకు కుటుంబాలకు భారం పడుతుంది.ఒక్కో కుటుంబానికి లక్ష రూపాయలు వసూలు చేసి కాంగ్రెస్ ప్రభుత్వం భారం మోపుతోందన్నారు. మార్చి 31 వరకు ఎల్‌ఆర్‌ఎస్ కట్టి తీరాలని ప్రజల మెడమీద కత్తి పెట్టారని, ఎల్‌ఆర్‌ఎస్ ప్రభుత్వ ఖజానా నింపడానికే అన్నట్లుగా ఉందని విమర్శించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఎల్‌ఆర్‌ఎస్‌ను వెంటనే విరమించుకోవాలన్నారు. కాంగ్రెస్ చెప్పినట్లు ఎల్‌ఆర్‌ఎస్ ఉచితంగా చేయాలని డిమాండ్ చేశారు.