Janasena Supports To BJP in Jubilee Hills By Elections: తెలంగాణ రాజకీయం జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక చుట్టూనే తిరుగుతుంది. ఈ ఎన్నికలో బీజేపీకి జనసేన పూర్తి మద్ధతు ప్రకటించింది. నేడు (మంగళవారం) బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డితో ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు శంకర్‌గౌడ్ భేటీ అనంతరం ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. బీజేపీ అభ్యర్థి లంకల దిలీప్ రెడ్డికి మద్దతుగా జనసేన నాయకులు ప్రచారంలో పాల్గొననున్నట్లు ఇరు పార్టీలు ప్రకటించాయి. జనసేన అధినేత పవన్ కళ్యాన్ సైతం ఈ ఎన్నికల ప్రచారంలో పాల్గొనే అవకాశం ఉంది. అయితే, దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ప్రస్తుతం, ఏపీలో బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి అధికారంలో ఉంది. ఈ మూడు పార్టీలు ఏపీలో పొత్తు ధర్మాన్ని పాటిస్తున్నాయి. ఇదే తరహాలో తెలంగాణలోనూ బీజేపీకి మద్ధతుగా నిలవాలని జనసేన నిర్ణయించింది. ఈ మేరకు తాజా భేటీలో కీలక నిర్ణయం తీసుకుంది. ఇదిలా ఉంటే, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మూడు ప్రధాన పార్టీలకు ప్రతిష్ఠాత్మకంగా మారింది. గెలిచి సత్తా చాటాలని కాంగ్రెస్, తమ సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలని బీఆర్‌ఎస్, అనూహ్య విజయాన్ని నమోదు చేసి గ్రేటర్‌లో పట్టు నిలుపుకోవాలని బీజేపీ తహతహలాడుతున్నాయి. దీంతో, జూబ్లీహిల్స్‌లో త్రిముఖ పోరు ఆసక్తికరంగా మారింది.
బీజేపీకి సవాల్..ఓటర్లలో అయోమయం..!
జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో ప్రధాన పోటీ కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మధ్యే ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. బీజేపీని కేవలం ‘ఓట్లు చీల్చే పార్టీ’గానే మిగిలిన రెండు పార్టీలు చిత్రీకరిస్తున్నాయి. ఇందుకు తోడు, ప్రత్యర్థి పార్టీల నుంచి పరస్పర ఆరోపణలు కమలనాథులను మరింత ఇబ్బంది పెడుతున్నాయి. బీజేపీ-బీఆర్‌ఎస్ రెండూ ఒక్కటే అని సీఎం రేవంత్ ఆరోపిస్తుండగా.. మరోవైపు, బీజేపీ-కాంగ్రెస్ ఒక్కటే అంటూ బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ఎదురుదాడి చేస్తున్నారు. ఈ విమర్శల కారణంగా బీజేపీ రాజకీయ వైఖరిపై ప్రజల్లో ఒక రకమైన అయోమయం నెలకొంది. దీనికి తోడు, కమలనాథులు అభ్యర్థిని ఆలస్యంగా ప్రకటించడం, ప్రచార వ్యూహాలు పదును తేలకపోవడం పార్టీకి ప్రతికూలంగా మారింది.
ఏపీ పొత్తుల ప్రభావం.. టీడీపీ-జనసేన ఓట్లపై ఆశ..!
బీజేపీకి ఈ ఉప ఎన్నికలో మరో పెద్ద సవాల్ ఎదురవుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ, జనసేనలతో కలిసి ఎన్డీయే కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీజేపీ, తెలంగాణలో మాత్రం ఒంటరి పోరు చేస్తోంది. గత 2023 సాధారణ ఎన్నికల్లో బీజేపీకి జూబ్లీ హిల్స్‌లో కేవలం 25 వేల ఓట్లు మాత్రమే వచ్చాయి. ఈసారి అన్ని పార్టీలు దృష్టి సారించిన ఉప ఎన్నిక కావడంతో, ప్రతీ ఓటూ కీలకం. గత ఓట్లను నిలబెట్టుకుని, ఇంకా ఎక్కువ ఓట్లు సాధిస్తేనే బీజేపీకి పరువు దక్కుతుంది. ఈ నేపథ్యంలో, బీజేపీ తన మిత్రపక్షాలైన టీడీపీ, జనసేనల నుంచి మద్ధతు ఆశించింది. అందుకు అనుగుణంగానే జనసేన బీజేపీకి మద్దతు ప్రకటించింది. అయితే, టీడీపీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. జూబ్లీ హిల్స్‌లో టీడీపీకి ఓట్లు, జనసేనకు అభిమాన గణం గణనీయంగా ఉంది. దీంతో, గెలుపోటములపై ఈ నిర్ణయం ఎఫెక్ట్ చూపనుంది.


