Kurnool Bus Accident Jayasurya Escaped: కర్నూలు బస్సు ప్రమాదంలో బతికి బయటపడిన వారంతా మృత్యుంజయులే.. వారికిది మరో కొత్త జన్మ అనడంలో సందేహం లేదు. అగ్ని గోళంలా మారిన ఆ బస్సు దృశ్యాలు చూసిన వారినే కలవరపెడుతుంటే.. ఇక అందులో చిక్కుకుని బయటపడ్డ వారు చావునే జయించి బతికి బట్టకట్టారు. చదువు పూర్తయి ఉద్యోగ ప్రయత్నాల్లో భాగంగా గంపెడాశలతో బెంగళూరుకు బయలుదేరిన ఓ యువకుడు.. మరణాన్ని జయించడమే కాదు.. తనతో పాటు మరో ఏడుగురికి పునర్జన్మనిచ్చాడు.
కడప జిల్లా జమ్మలమడుగుకి చెందిన జయసూర్య కుటుంబం హైదరాబాద్ మియాపూర్‌లో నివాసముంటోంది. బీటెక్ పూర్తి చేసిన అతను ఉద్యోగ ప్రయత్నాల్లో భాగంగా బెంగళూరులో ఇంటర్వ్యూ కోసం వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సులో టికెట్ బుక్ చేసుకున్నాడు. గురువారం సాయంత్రం అతను మియాపూర్ బస్టాప్‌కి వెళ్లగానే బస్సు అప్పటికే వెళ్లిపోయింది. అయినప్పటికీ పట్టు వదలకుండా ఛేజింగ్ చేసి మరీ మూసాపేట్‌లో బస్సు ఎక్కాడు. కానీ అదే బస్సు కర్నూల్‌లో అగ్ని ప్రమాదానికి గురై 20 మంది ప్రాణాలను బలి తీసుకోగా.. ఆ మరణ శాసనం నుంచి జయసూర్య తప్పించుకున్నాడు.
Also Read: https://teluguprabha.net/andhra-pradesh-news/kurnool-bus-accident-biker-details/
ప్రమాదం జరిగిన వెంటనే మంటలు వ్యాపించడంతో జయసూర్య చాకచక్యంగా అద్దాలు పగలగొట్డాడు. తాను బయటపడటంతో పాటు బస్సులోని మరో ఏడుగురిని కిటికీ ద్వారా రక్షించాడు. బస్సు అద్దాలు పగలగొట్టేందుకు తనకు బయటనుంచి మహేష్ అనే వ్యక్తి సాయం చేసినట్లు జయసూర్య చెప్పుకొచ్చాడు. ప్రమాద సమాచారం అందుకున్న జయసూర్య కుటుంబీకులు.. తమ కొడుకు ఆచూకీ కోసం కంగారు పడతున్నారు. వారికి ఫోన్ చేసి తన క్షేమ సమాచారాలు తెలియజేశాడు. ఆ వార్త విని కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదంలో స్వల్ప గాయాలు కావడంతో కర్నూల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తల్లిదండ్రులకు తెలిపాడు.


