Friday, November 22, 2024
HomeతెలంగాణJeevan Reddy: మీకు.. మీ పార్టీకో దండం.. జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Jeevan Reddy: మీకు.. మీ పార్టీకో దండం.. జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Jeevan Reddy| కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆ పార్టీపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తన ప్రధాన అనుచరుడు దారుణ హత్యకు గురికావడంతో జీవన్ రెడ్డి, అనుచరులతో రోడ్డుపై భైఠాయించారు. ఈ నేపథ్యంలో జీవన్ రెడ్డిని సముదాయించేందుకు ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ వెళ్లారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ మీకు.. మీ కాంగ్రెస్ పార్టీకో దండం.. ఇకనైనా మమ్మల్ని బతకనియ్యండంటూ మండిపడ్డారు. ఇంత కాలం పార్టీలో మానసిక అవమానాలకు గురవుతున్నా తట్టుకున్నామని.. ఇప్పుడు భౌతికంగా దాడులు చేసి చంపుతున్నారన్నారని వాపోయారు. ఇన్ని చేస్తున్నా ఎందుకు భరించాలని.. కావాలంటే ఓ స్వచ్ఛంద సంస్థ పెట్టుకొనైనా ప్రజలకు సేవ చేస్తానంటూ ఫైర్ అయ్యారు.

- Advertisement -

ఇదే సమయంలో జీవన్ రెడ్డికి ఫోన్ చేసిన పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్‌పై ఆయన విరుచకుపడ్డారు. పార్టీలో ఎందుకు కొనసాగాలని.. దయచేసి తనను క్షమించాలని తెలిపారు. నాలుగు దశబ్దాల కష్టానికి మంచి బహుమతి ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ ఫోన్ కట్ చేశారు. మరోవైపు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ఇంటి దగ్గర పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జగిత్యాల ఎస్పీకి ఎమ్మెల్యే సంజయ్ ఫోన్ చేసి హత్యపై ఆరా తీశారు. నిందితులను కఠినంగా శిక్షించాలని హత్యలో ప్రమేయం ఉన్న ఏ ఒక్కరినీ వదలొద్దని ఆదేశించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని సూచించారు.

కాగా జగిత్యాల రూరల్ మండలం జాబితాపూర్ గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ, జీవన్ రెడ్డి ముఖ్య అనుచరుడు మారు గంగారెడ్డిని(58) గుర్తుతెలియని దుండగులు కిరాతకంగా హత్య చేశారు. ఇవాళ ఉదయం గ్రామంలో తన ద్విచక్రవాహనంపై వెళుతున్న గంగారెడ్డిని ప్రత్యర్థులు తొలుత కారుతో వెనుక నుండి ఢీ కొట్టి కింద పడగానే కత్తులతో విచక్షణరహితంగా దాడి చేశారు. డీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. 2023లో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి సంజయ్ కుమార్‌పై జీవన్ రెడ్డి ఓడిపోయారు. కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో సంజయ్ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి హస్తం కండువా కప్పుకున్నారు. దీంతో తన ప్రత్యర్థిని తనకు తెలియకుండా పార్టీలో చేర్చుకోవడంపై జీవన్ రెడ్డి అలకబూనారు. అనంతరం కొంతమంది సీనియర్ నాయకులు ఆయనకు నచ్చజెప్పడంతో కాస్త వెనక్కు తగ్గారు. అయినా కానీ ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణమే నెలకొంది

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News