తెలంగాణలో గడిచిన వందేళ్లలో జరగని అభివృద్ధిని కేవలం పదేండ్లలోనే చేసి చూపించామని
పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ పట్టణంలో మామిడిపల్లి చౌరస్తా నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు పోలీసు శాఖ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిర్వహించిన 2-కే రన్ కార్యక్రమంలో జీవన్ రెడ్డి పాల్గొన్నారు. వయస్సుతో నిమిత్తం లేకుండా పట్టణ వాసులు పెద్ద సంఖ్యలో హాజరైన 2-కే రన్ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ కు అభివృద్ధి, సంక్షేమం రెండు కండ్లు అని పేర్కొన్నారు. ఎవరైనా దశాబ్ది ఉత్సవాలను విమర్శిస్తే ఊరుకునేది లేదని, అభివృద్ధి నిరోధకులకు గట్టి బుద్ధి చెప్పి తీరుతామని ఆయన హెచ్చరించారు.
కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఏనాడూ ప్రజలను పట్టించు కోలేదని ఆయన విమర్శించారు. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ను శత్రువుగా చూస్తోందని జీవన్ రెడ్డి మండిపడ్డారు. నలుగురు బీజేపీ ఎంపీలు రాష్ట్రాభి వృద్ధిని విస్మరించారని ఆయన మండిపడ్డారు.కేంద్రం సహకరించక పోయినా అభివృద్ధి లో తెలంగాణ నెంబర్ వన్ గా నిలిచిందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుచూపు వల్లే అధ్బుత ఫలితాలు వచ్చి నేడు తెలంగాణ మోడల్ దేశానికే ఆదర్శంగా నిలిచింది. “చేసిన మంచి పనులు చెప్పుకుంటే తప్పా?. వేదిక ఏదైనా నేను అభివృద్ధి, సంక్షేమం గురించే మాట్లాడుతా. ఆర్మూర్ అభివృద్ధిపై ప్రజల్లో చర్చ జరగాలి. నేను నిరంతరం నియోజకవర్గ అభివృద్ధికే పాటుపడుతున్నా.
నేను తెచ్చిన పథకాలు చెబితే రామాయణమంత
ఆర్మూర్ నియోజకవర్గ అభివృద్ధిని గతంలో ఎప్పుడూ చూడలేదు. రూ.3000 కోట్లతో ఆర్మూర్ నియోజక వర్గాన్ని అభివృద్ధి చేశా. ఆర్మూర్ రెవెన్యు డివిజన్, ఆలూరు, డొంకేశ్వర్ లు కొత్త మండలాలు, అంబేద్కర్ చౌరస్తా ను సుందరీకరణ, సిద్ధులగుట్టకు రూ. 20 కోట్లతో ఘాట్ రోడ్డు, సెంట్రల్ లైటింగ్ సిస్టం, ఆర్మూర్ చుట్టూ 9బైపాస్ రోడ్లు, రూ.450 కోట్లు ఖర్చు చేసి మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ నల్లాలతో మంచినీళ్లు,
మిషన్ కాకతీయ ద్వారా రూ.58 కోట్లు ఖర్చు చేసి 220 కు పైగా చెరువుల పునరుద్ధరణ, ఎకరానికి పది వేల చొప్పున రైతు బంధు, పెట్టుబడి ఇస్తున్నాం.
24 గంటల ఉచిత విద్యుత్, కల్యాణ లక్ష్మీ ద్వారా 8,500 మంది, షాదీముబారక్ ద్వారా 16వందల మంది పేదింటి ఆడపిల్లల పెండ్లిండ్లు, ఆర్మూర్ కు వంద పడకల ఆసుపత్రి, రూ. 120 కోట్లతో చేసి పంచగూడ వంతెన నిర్మాణం, నియోజకవర్గ వ్యాప్తంగా వివిధ సామాజిక వర్గాల వారికి 200కు పైగా భవనాల నిర్మాణం, వాటిలో దాదాపు 10 మల్టీ పర్పస్ కమ్యూనిటి హాళ్ల మంజూరు, 26 వందల డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం, సొంత స్థలాలు ఉన్న మరో మూడు వేల మందికి ఇండ్లు కట్టుకోవడానికి మూడు లక్షల చొప్పున ఇవ్వడం, దళిత బంధు ద్వారా 11వందల మందికి రూ. 10 లక్షల చొప్పున పంచడం, బీసీలకు లక్ష రూపాయలు చొప్పున ఆర్థిక సాయం, వృద్దులు, వితంతువులు, ఒంటరి మహిళలు, వికలాంగులకు రూ.2016, రూ.4016 చొప్పున ఇస్తున్న పెన్షన్లు, 8వేల మంది యాదవ సోదరులకు గొర్రెల యూనిట్లు, ఎర్రజొన్న రైతుల బకాయిల చెల్లింపు, తళతళ మెరిసే రోడ్లు, డ్రైనేజీలను ఆధునీకరణ, పల్లె ప్రగతి ద్వారా పల్లెలన్నీ ప్రకృతి వనాలు, నర్సరీలు, సీసీ రోడ్లు, సకల సౌకర్యాలతో వైకుంఠ దామాలు, చెత్తను తొలగించే ట్రాక్టర్లు, పరిసరాల పరిశుభ్రత, మనఊరు-మన బడి ద్వారా పాఠశాలల అభివృద్ధి వంటివి మా విజయాలు కావా? అని జీవన్ రెడ్డి ప్రశ్నించారు. తాను చేసిన అభివృద్ధి కార్యక్రమాలే మళ్ళీ గెలిపిస్తాయన్నారు.
ప్రజలంతా అభివృద్ధి వైపే నిలబడాలని జీవన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ పండిత్ వినితాపవన్, వైస్ ఛైర్మన్ మున్నభాయ్, నందిపేట్ జడ్పిటిసి యమునా ముత్యం, ఆర్మూర్ జడ్పిటిసి సంతోష్, మాక్లూర్ ఎంపిపి మాస్త ప్రభాకర్, నందిపేట్ ఎంపిపి వాకిడి సంతోష్ రెడ్డి, ఆర్మూర్ ఎంపిపి పస్క నర్సయ్య, కౌన్సిలర్లు, సర్పంచులు, ఎంపిటీసిలు, పీఏసీఎస్ ఛైర్మన్లు, పోలీసు అధికారులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.