Thursday, September 19, 2024
HomeతెలంగాణJivan Reddy: దమ్ముంటే మోడీ హైదరాబాద్ ఎంపీగా గెలవాలి

Jivan Reddy: దమ్ముంటే మోడీ హైదరాబాద్ ఎంపీగా గెలవాలి

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నిలువెల్లా విషం, విద్వేషంతో మరిగిపోతున్నాడని పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్ రెడ్డి నిప్పులు చెరిగారు. బండి సంజయ్ అబద్ధాలకు పుట్టిన అవిభక్త కవల అని ఆయన బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ధ్వజమెత్తారు. ఆయన చదువు, సంజ్ఞ లేని సన్నాసని, తలబిరుసు దురహాంకారి అంటూ జీవన్ రెడ్డి మండిపడ్డారు. ఎంపీ పదవికి కాదుకదా వార్డు మెంబర్ గా పనిచేయడానికి కూడా బండి పనికిరాడని ధ్వజమెత్తారు.
తెలంగాణ అభివృద్ధి నిరోధక విద్రోహిగా మారి బీఆర్ఎస్ ప్రభుత్వంపై, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిపై, ఆయన ఫ్యామిలీ పై విషం కక్కడమే పనిగా పెట్టుకుండు. తెలంగాణ బతుకుపాటపైనే కాదు, తెలంగాణ దేహదారుడ్య కీర్తి ప్రతిష్టలకు ప్రతీక అయిన “ఆట”పైన కూడా తీట మాటలు మాట్లాడుతుండు అని జీవన్ రెడ్డి దుయ్యబట్టారు. హైదరాబాద్ స్పోర్ట్స్ హబ్ అని పలు సందర్భాలలో కేంద్రమే పొగిడిన సంగతి బండి సంజయ్ కు తెలియదా? అని ఆయన నిలదీశారు. క్రీడలను ప్రోత్సహించడంలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ఫస్ట్ అని ఆయన స్పష్టం చేశారు. దేశంలో క్రీడాభివృద్ధిని పూర్తిగా విస్మరించిన పాపం కేంద్ర బీజేపీ ప్రభుత్వానిదని ఆయన ఆరోపించారు. మెడల్స్ తెచ్చిన ఆటగాళ్లను ఇంటికి పిలిచి ఫోటోలు దిగడం తప్ప మోడీ ఏనాడూ క్రీడాకారులను ప్రోత్సహించిన పాపాన పోలేదని ఆయన విమర్శించారు. దేశానికి ఏ విభాగంలో మెడల్ వచ్చినా దానిలో తెలంగాణ రాష్ట్ర క్రీడాకారుల పాత్రే కీలకమన్నారు.

- Advertisement -

గుజరాత్ తో సహా బీజేపీ పాలిత రాష్ట్రాల నుంచి ప్రాతినిధ్యం వహించి దేశానికి అంతర్జాతీయ మెడల్స్ సాధించిన ఒక్క క్రీడాకారుడి పేరు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. అదే తెలంగాణ పేరు చెబితే క్రికెటర్లు గులాం అహ్మద్, ఎం. ఎల్. జైసింహ, మహేశ్ దేవనాని, మహమ్మద్ అజారుద్దీన్, వి. వి. ఎస్. లక్ష్మణ్, వెంకటపతి రాజు, శివలాల్ యాదవ్, అర్షద్ అయూబ్, సయ్యద్ అబిద్ అలీ, మిథాలీ రాజ్, నోయెల్ డేవిడ్ ఫుట్‌బాల్ క్రీడాకారులు సయ్యద్ అబ్దుల్ రహీమ్, సయ్యద్ ఖాజా మొయినుద్దీన్, సయ్యద్ నయీముద్దీన్, షబ్బీర్ అలీ, టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా, బ్యాడ్మింటన్ క్రీడాకారులు ఎస్. ఎమ్. ఆరిఫ్, పుల్లెల గోపీచంద్, సైనా నెహ్వాల్, పి. వి. సింధు, జ్వాలా గుత్తా, చేతన్ ఆనంద్, హాకీ క్రీడాకారులు సయ్యద్ మహ్మద్ హది, ముఖేష్ కుమార్, రైఫిల్ షూటర్లు గగన్ నారంగ్, అషెర్ నోరియా, బాడీబిల్డర్ మీర్ మొహతేషామ్ అలీ ఖాన్, పంచ్ పవర్ చూపించి , ప్రపంచ ఛాంపియన్ షిప్ ఫైనల్స్ లో విజయం సాధించిన నిఖత్ జరీన్, వరల్డ్ ఛాంపియన్ షిప్లు సాధించిన షూటింగ్ క్రీడాకారిణి ఇషా సింగ్ వంటి వారు గుర్తుకు వస్తారని ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్రం క్రీడలకు పుట్టిల్లు అని తెలియకపోవడం బండి సంజయ్ అజ్ఞానానికి నిదర్శనం అని ఆయన మండిపడ్డారు.
“అంతర్జాతీయ టోర్నమెంట్లలో ఇటీవల తెలంగాణ క్రీడాకారులు గొప్ప ఫలితాలు రాబడుతున్నారు. మనోళ్లు దేశం గర్వపడే ప్రదర్శనలు కనబరుస్తున్నారు. బాక్సింగ్‌, క్రికెట్‌, బ్యాడ్మింటన్‌, జిమ్నాస్టిక్స్‌, టెన్నిస్‌, ఫెన్సింగ్‌, టేబుల్‌ టెన్నిస్‌, ఆర్చరీ, స్విమ్మింగ్‌, కబడ్డీ సహా పలు క్రీడాంశాల్లో తెలంగాణ క్రీడాకారులు దూసుకు పోతున్నారు. తెలంగాణ క్రీడాకారుల అద్వితీయ ప్రదర్శన, క్షేత్రస్థాయిలో క్రీడాభివృద్ధితో భారత క్రీడారంగంలో తెలంగాణ అగ్రగామిగా నిలిచింది. సీఎం కేసీఆర్‌ రాష్ట్ర బడ్జెట్‌లో క్రీడలకు పెద్ద పీట వేశారు. గత ఏడాది బడ్జెట్‌తో పోల్చితే రూ. 53.79 కోట్లు అధికంగా నిధులు కేటాయించారు. 29 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాలు కలిపి కేంద్ర బడ్జెట్లో దేశంలో ఖేలో ఇండియా క్రీడలకు రూ.1000 కోట్లు మాత్రమే కేటాయించారు. అది ఖేలో ఇండియా కాదు, ఆటలను కూల్చే ఇండియా. తెలంగాణలో క్రీడా స్వర్ణయుగం తీసుకురావడానికి బడ్జెట్‌లో భారీ ఎత్తున నిధులు ఇచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలో క్రీడలకు రూ.5-6 కోట్లు అధికంగా కేటాయించేందుకు ఆపసోపాలు పడేవారు. ఇప్పుడు మన రాష్ట్రంలో ఏకంగా ఒకేసారి రూ.53.79 కోట్లు అధికంగా నిధులు ఇచ్చారు. క్రీడారంగం అభివృద్ది పట్ల రాష్ట్ర ప్రభుత్వ చిత్తశుద్ధికి ఇది నిదర్శనం.
క్షేత్రస్థాయి నుంచే క్రీడలు, క్రీడాకారుల అభివృద్ధి రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన ధ్యేయం. అందుకోసమే గ్రామీణ క్రీడాప్రాంగణాలను అసమాన రీతిలో ఏర్పాటు చేస్తోంది ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా యుద్ధ ప్రాతిపదికన 12140కిపై గ్రామీణ క్రీడా ప్రాంగణాలు సిద్ధమయ్యాయి. ఓవరాల్‌గా 19 వేల క్రీడా ప్రాంగణాల ఏర్పాటు రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం. గ్రామీణ ప్రాంతాల్లో క్రీడల అభివృద్ధి, గ్రామీణ క్రీడాకారులకు ఆట స్థలాలను అందించే బృహత్తర లక్ష్యంతో ఈ ఏడాది బడ్జెట్‌లో రూ.45 కోట్లు నిధులు కేటాయించారు. గతంలో గ్రామాల్లో క్రీడలకు అనువైన ప్రదేశం ఉండేది కాదు. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా క్రీడా ప్రాంగణాల ఏర్పాటు సాధారణ విషయం కాదు. ప్రభుత్వానికి గొప్ప సంకల్పం ఉన్నప్పుడే ఇది సాధ్యపడుతుంది. ప్రస్తుతం జిల్లా కేంద్రానికి ఓ స్టేడియం అందుబాటులోకి తీసుకొస్తున్నాం. అన్ని క్రీడలకు ఈ స్టేడియాలు కేంద్రాలుగా నిలుస్తాయి. గ్రామీణ క్రీడాకారులకు ఇవి ఎంతో దన్నుగా నిలుస్తాయి. రాష్ట్రంలో క్రీడాకారులకు ప్రభుత్వ ఉద్యోగాలలో 2శాతం, ఉన్నత విద్యా కోసం 0.5 శాతం రిజర్వేషన్లను అమలు చేస్తున్నాం
భవిష్యత్‌లో గ్రామీణ క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో రాణించేం దుకు ఇది పునాదిగా నిలుస్తుందనే నమ్మకం ఉంది అని జీవన్ రెడ్డి పేర్కొన్నారు. మరి కేంద్రం చేసిందేమిటో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఈడీ, సీబీఐ, ఐటీ సంస్థలను అడ్డుపెట్టుకొని రాజకీయ రాక్షస క్రీడ ఆడడంలో మాత్రం నరేంద్ర మోడీ ప్రపంచ ఛాంపియన్ అని జీవన్ రెడ్డి ఎద్దేవా చేశారు. మద్యం తాగడం,వాగడంలో బీజేపీ రాష్ట్రాలే నెంబర్ వన్ అని ఆయన విమర్శించారు.
వచ్చే ఎన్నికల్లో మేమే గెలుస్తాం, పాతబస్తీ కూడా బీజేపీదేనని కోతలు కోసిన బండి సంజయ్ తెలంగాణలో బీజేపీకి సింగిల్ డిజిటే గతి అని గుర్తు పెట్టుకోవాలన్నారు. బీజేపికి దమ్ముంటే మోడీని హైదరాబాద్ ఎంపీ స్థానం లో పోటీ చేయించి గెలిపించుకోవాలని జీవన్ రెడ్డి సవాల్ విసిరారు. బండి సంజయ్ నోరు అదుపులో పెట్టుకోకపోతే నాలుక చీరేస్తాం అని జీవన్ రెడ్డి తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. కాంగ్రెస్ యూత్ డిక్లరేషన్ ట్రూత్ లెస్, యూజ్ లెస్ డిక్లరేషన్ సరూర్ నగర్ సభలో ప్రియాంక వధేరా విడుదల చేసిన
కాంగ్రెస్ యూత్ డిక్లరేషన్ ట్రూత్ లెస్, యూజ్ లెస్ డిక్లరేషన్ అని జీవన్ రెడ్డి కొట్టిపారేశారు. అది డిక్లరేషన్ కాదు కాంగ్రెస్ ఫ్రస్టేషన్. ఆ పార్టీ నాయకుల డిఫ్రెషన్. ఓట్ల కోసం తెలంగాణ ప్రజలను ఏమార్చే సరికొత్త డ్రామా. వరంగల్ లో రాహుల్ గాంధీ విడుదల చేసిన రైతు డిక్లరేషన్ లాగే ఈ యూత్ డిక్లరేషన్ కూడా చెత్తా చెదారం. ఇది కొత్త ఉద్యోగాలిచ్చే డిక్లరేషన్ కాదు.ఉన్న ఉద్యోగాలను ఊడగొట్టే డిక్లరేషన్. ఈ డిక్లరేషన్ అంత మంచిదయితే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు అమలు చేయడం లేదు. ఇది అసలు నిరుద్యోగుల కోసం కాదు. పదేళ్లుగా పదవులు లేక అసహనంతో ఉన్న కాంగ్రెస్ నిరుద్యోగుల కోసం రూపొందించిన రాజకీయ డిక్లరేషన్ అని జీవన్ రెడ్డి మండిపడ్డారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News