Friday, September 20, 2024
HomeతెలంగాణJivan Reddy: కేసీఆర్ నా ఇష్టదైవం, జీవోల జీవన్ రెడ్డి అనే పేరొచ్చింది అందుకే..

Jivan Reddy: కేసీఆర్ నా ఇష్టదైవం, జీవోల జీవన్ రెడ్డి అనే పేరొచ్చింది అందుకే..

ముఖ్యమంత్రి తనకు అత్యంత ఇష్ట దైవమని, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు తనకు వెయ్యి ఏనుగుల బలమని .. పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్ రెడ్డి అన్నారు. మాక్లూర్ లోని అడవి మామిడిపల్లి సమీపంలో గల వంజరి సంఘం ఫంక్షన్ హాలులో జరిగిన మాక్లూర్ మండల బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ దేశంలోనే బీఆర్ఎస్ అతిపెద్ద కుటుంబమని అభివర్ణించారు. “పథకమేదైనా అన్ని రంగాల్లో తెలంగాణ రాష్ట్రమే నెంబర్-వన్. 450 పథకాలు అమలు చేస్తున్న కేసీఆర్ వంటి దమ్మున్న సీఎం దేశంలోనే లేరు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమంపై చర్చకు సిద్ధమా?. ఇక్కడ అమలవుతున్న ఒక్క పథకమైనా దేశంలో ఎక్కడైనా ఉందా?. కొందరు సన్నాసులు తెలంగాణ వస్తే ఏమోస్తదన్నారు. ఆ సన్నాసులకు ఇదే నా సమాధానం. తెలంగాణ వస్తే రైతు బంబొచ్చింది. రైతుబీమా వచ్చింది. 24 గంటల ఉచిత కరెంటొచ్చింది.ఇంటింటికీ నల్లాల ద్వారా మిషన్ భగీరధ నీళ్లొచ్చాయి.
మిషన్ కాకతీయ ద్వారా చెరువులు బాగుపడ్డాయి. ఆ చెరువుల్లో చేపలు పెరుగుతూ మన మత్స్యకారుల జీవితాలకు వెలుగొచ్చింది. గొర్రెల సంపదతో మన యాదవ సోదరుల వాకిళ్ళు కళకళలాడుతున్నాయి. కల్యాణ లక్ష్మీ, షాదీముబారక్ ద్వారా పేదింటి ఆడ పిల్లలు పెండ్లిండ్లు జరుగుతున్నాయి. ఇంకా దళిత, గిరిజన బంధు, కేసీఆర్ కిట్లు వంటి స్కీము లొచ్చాయి. లక్షలాది ఉద్యోగాలొచ్చాయి. ఐటీ ప్రాజెక్టు లొచ్చాయి. భారీ పరిశ్రమలొచ్చి లక్షలాదిమందికి ఉద్యోగాలొచ్చాయి. పల్లెల, పట్టణ ప్రగతోచ్చింది. ఆ ప్రగతితో లెక్కలేనన్ని అవార్డులొచ్చాయి. దండగన్న వ్యవసాయం పండగయింది. జీడీపీ, తలసరి ఆదాయం, వరి పంట దిగుమతి,ధాన్యం కొనుగోలు, గొర్రెల పెంపకం-ఇలా అన్ని రంగాలలో మనమే ముందున్నాము. తెలంగాణ మోడల్ దేశవ్యాప్తంగా కీర్తి గడిస్తోంది. కేసీఆర్ గారు ప్రధాన మంత్రి కావాలన్నదే నా జీవితాశయం. ఆయన సారధ్యంలోనే అన్ని రాష్ట్రాలకూ తెలంగాణ పథకాలు అమలు జరుగుతాయి. మహారాష్ట్ర, ఛత్తీస్ ఘడ్, ఏపీతో సహా అన్ని రాష్ట్రాలలో తెలంగాణ పథకాలు అమలు జరగాలని ఆ రాష్ట్రాల ప్రజలు కోరుకుంటున్నారు. విపక్షాల దుర్భుద్ధి, మన అభివృద్ధికి మధ్య యుద్ధం జరుగుతోంది. రేవంత్ రెడ్డి, బండి సంజయ్ లు అష్టదరిద్రులు. తెలంగాణ వ్యతిరేక అపశకునపక్షులు. ఎంపీ అరగుండు అరవింద్ నిజామాబాద్ జిల్లా కు పట్టిన శని. కాంగ్రెస్, బీజేపీలు తెలంగాణ చావుకోరే కాలకేయులు. బుద్ధి లేని రెండు ప్రమాదకర జాతీయ పార్టీలతో మనం యుద్ధం చేస్తున్నాం. ఈ ఎన్నికలు మనకు కీలకం. వచ్చే ఎన్నికల్లోనూ చెడుపై మళ్లీ మంచే గెలవాలి. కేసీఆర్ గారి హ్యాట్రిక్ గెలుపే తెలంగాణకు నిజమైన పండగ కావాలి. కాంగ్రెస్, బీజేపీలు తెలంగాణ శత్రువులు. సంపద పెంచడం, పేదలకు పంచడమే కేసీఆర్ కు తెలుసు. దేశాన్ని ముంచడమే మోడీకి తెలుసు. దేశాన్ని పోషిస్తున్న 5రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి.
సొమ్ము రాష్ట్రాలది, సోకు కేంద్రానిది. పిల్లలు తాగే పాలపైనా జీఎస్ టీ విధించిన ఘనుడు మోడీ. కర్ణాటక ప్రజలు బీజేపీకి కర్రుకాల్చి వాతలు పెట్టారు. తెలంగాణ ప్రజాలూ అదేచేసి బీజేపీని తరిమికొట్టాలి” అని జీవన్ రెడ్డి ఉద్వేగంతో మండి పడ్డారు. అభివృద్ధి, సంక్షేమంలో ఆర్మూర్ నియోజకవర్గం ఫస్ట్ అని ఆయన ఉద్ఘాటించారు. అభివృద్ధికి అసలైన ఆనవాలుగా ఆర్మూర్ ను నిలిపా. రూ.2500 కోట్లతో ఆర్మూర్ నియోజక వర్గాన్ని అభివృద్ధి చేశా. 62 వేల మందికి పెన్షన్లు, 65వేల మందికి రైతుబంధు నిధులు వస్తున్నాయి. మిషన్ కాకతీయ వల్ల చెరువులు కళకళలాడుతున్నాయి. ఇంటింటికీ మిషన్ భగీరధ మంచి నీళ్ల సరఫరా జరుగుతోంది. చెరువుల్లో మత్స్య సంపద పెరుగుతోంది. నియోజకవర్గ వ్యాప్తంగా వివిధ సామాజిక వర్గాల వారికి 200కు పైగా భవనాలకు నిధులిచ్చాం. వాటిలో దాదాపు 10 మల్టీ పర్పస్ కమ్యూనిటి హాళ్ల నిర్మాణానికి కోట్లాది రూపాయలు మంజూరయ్యాయి. 17 వందల డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను నిర్మించాం. గృహ లక్ష్మీ ద్వారా సొంత స్థలాలు ఉన్న మరో మూడు వేల మందికి ఇండ్లు కట్టుకోవడానికి మూడు లక్షల చొప్పున ఇస్తున్నాం. కవితక్క పాత్ర లేని ఆర్మూర్ అభివృద్ధిని ఊహించలేం. కవితక్క ఆశీస్సులతోనే నాకు ‘జీవోల జీవన్ రెడ్డి’ అనే పేరొచ్చింది. వివిధ కులాల ఫంక్షన్ హాళ్ల నిర్మాణానికి కర్మ, కర్త, క్రియ కవితక్కే. ఆర్మూర్ లో మూడోసారి గెలుపునాదే.
నాకు ఎలాంటి రాజకీయ నేపధ్యం లేదు. మా నాయన సర్పంచు కాదు. మా అమ్మ ఉప సర్పంచు కాదు. నేను సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చా. అయినా నన్ను ఆదరించిన ఆర్మూర్ నియోజకవర్గ ప్రజల మనసు గొప్పది. పార్టీ కార్యకర్తల కాళ్ళు కడిగి నా నెత్తిన చల్లుకున్నా వారి రుణం తీర్చుకోలేను అని జీవన్ రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. ఈ అభివృద్ధి , సంక్షేమ పథకాల గురించి పార్టీ కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి ప్రచారం చేయాలి. మనమంతా కష్టపడి మూడో సారి బీఆర్ఎస్ ను అధికారంలోకి తెచ్చుకుందాం. నేను మీ బిడ్డను మళ్లీ ఆశీర్వదించండి అని జీవన్ రెడ్డి పిలుపునిచ్చారు.

- Advertisement -

గులాబీ వర్ణశోభితమైన మాక్లూర్-బీఆర్ఎస్ శ్రేణుల కోలాహలం

ఇదిలావుండగా బీఆర్ఎస్ కుటుంబ సభ్యుల ఆత్మీయ సమ్మేళనం సందర్భంగా మాక్లూర్ గులాబీ వర్ణ శోభితమైంది. పార్టీ శ్రేణుల కోలాహలంతో సమ్మేళనం జరిగిన ప్రాంగణం సందడిగా మారింది. మాక్లూర్ ఊరంతా పార్టీ పతాకాలు, ఫ్లెక్సీలతో గులాబీ మయమైంది. సమ్మేళనానికి హాజరైన వేలాది మంది బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు చేసిన “జై కేసీఆర్, దేశ్ కీ నేత కేసీఆర్, జై కవితక్క, జై జీవనన్న, జై తెలంగాణ” నినాదాలతో మాక్లూర్ దద్దరిల్లింది.

నూతన వస్త్రాల ప్రధానం

కాగా ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల కుటుంబాలను ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, రజిత రెడ్డి దంపతులు ఘనంగా సత్కరించారు. సమ్మేళనానికి సతీ సమేతంగా హాజరైన పార్టీ కార్యకర్తలకు, వారి సతీమణులకు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, రజిత రెడ్డి దంపతులు నూతన వస్త్రాలను పెట్టి వారి ఆశీస్సులు తీసుకున్నారు. సమ్మేళనం సందర్భంగా ఘనంగా విందు భోజనం ఏర్పాట్లు చేశారు. భోజనం ఏర్పాట్లు స్వయంగా పర్యవేక్షించిన జీవన్ రెడ్డి దంపతులు పార్టీ కార్యకర్తలకు, వారి కుటుంబ సభ్యులకు స్వయంగా వడ్డించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, రజిత రెడ్డి దంపతులు కార్యకర్తల యోగ క్షేమలు అడిగి తెలుసుకున్నారు. ఈ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి చామకూర మల్లారెడ్డి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, బీఆర్ఎస్ పార్టీ జిల్లా ఇంచార్జ్, శాసన మండలి వైస్ ఛైర్మన్ బండ ప్రకాష్, టీఎస్ డబ్ల్యు సీడీసీ చైర్ పర్సన్ ఆకుల లలిత, జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్ రావు, జిల్లా గ్రంధాలయం చైర్మన్ ఎల్ ఎం బీ రాజేశ్వర్, రాజారామ్ యాదవ్,కోటపాటి నరసింహ నాయుడు ,డాక్టర్ మధు శేఖర్ గారితో లతో పాటు మాక్లూర్ మండల బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News