Jr. NTR approached the Delhi High Court: ప్రముఖ తెలుగు సినీ నటుడు జూనీయర్ ఎన్టీఆర్ తన వ్యక్తిత్వ హక్కులను కాపాడాలంటూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తన అనుమతి లేకుండా తన ఫోటో, పేరును వాడుకోకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తనకు పర్మిషన్ లేకుండా కొన్ని సోషల్‌మీడియా ప్లాట్‌ఫామ్స్, ఈ కామర్స్ సంస్థలు తన ఫోటోలను అనధికారికంగా ఉపయోగిస్తున్నారని, తద్వారా తన వ్యక్తిగత హక్కులు ఉల్లంఘించబడుతున్నాయని ఆయన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఎన్టీఆర్ పిటిషన్‌పై విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్టు, ఎన్టీఆర్ వ్యక్తిత్వ హక్కులను కాపాడాలని పేర్కొంది. జూనియర్ ఎన్టీఆర్ ఫిర్యాదులపై సోషల్ మీడియా, ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లు తగిన చర్యలు తీసుకోవాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఐటీ రూల్స్ 2021 కింద మూడు రోజుల్లో తగిన చర్యలు తీసుకోవాలని కోర్టు తీర్పు ఆదేశించింది. తదుపరి విచారణ డిసెంబర్ 22 కు వాయిదా వేస్తూ.. ఆరోజున సవివరమైన ఆదేశాలు జారీ చేస్తామని హైకోర్టు జస్టిస్ మన్మీత్ ప్రీతమ్ సింగ్ అరోరా వెల్లడించారు.
ఇష్టానుసారంగా పోస్టులు పెట్టడం చెల్లదిక..
కాగా, తారక్‌కు ఉన్న అపారమైన ప్రజాదరణ దృష్ట్యా, ఆయన ఇమేజ్‌ను అక్రమంగా ఉపయోగించుకోవడం ద్వారా నకిలీ ఖాతాలు, వ్యాపార ప్రకటనలు సృష్టించే వారికి కోర్టు తీర్పు చెంపపెట్టులాంటిదని చెప్పవచ్చు. ఈ మధ్యకాలంలో సెలబ్రిటీల వ్యక్తిగత హక్కుల ఉల్లంఘన కేసులు పెరుగుతున్న నేపథ్యంలో, ఈ ఆదేశాలు సోషల్ మీడియా వినియోగదారులకు, ప్లాట్‌ఫామ్‌లకు ఒక హెచ్చరికగా నిలిచే అవకాశం ఉంది. జూనియర్ ఎన్టీఆర్ హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో ఇకపై తారక్ గురించి ఇష్టానుసారం పోస్టులు పెట్టేవాళ్లకు షాక్ తప్పదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
చిరంజీవి, నాగార్జున విషయంలోనూ..
కాగా, ఇటీవలి కాలంలో ఇలానే చిరంజీవి, నాగార్జున కూడా హైకోర్ట్‌ని ఆశ్రయించారు. తమ అనుమతి లేకుండా తమ పేరు, ఫొటో, వీడియోలు వాడకూడదని, ట్రోల్ చేయడం లాంటివి చేయకూడదని ఆదేశాలు తెచ్చుకున్నారు. ఇప్పుడు వీళ్ల బాటలోనే జూనియర్ ఎన్టీఆర్ కూడా హైకోర్టు తలుపు తట్టాడు. ఇకపై వాణిజ్య అవసరాల కోసం అనుమతి లేకుండా ఎన్టీఆర్ పేరు లేదా ఫొటోని ఉపయోగిస్తే చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఇక, ఎన్టీఆర్ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘డ్రాగన్’ చేస్తున్నాడు. వచ్చే ఏడాది జూన్‌లో ఇది థియేటర్లలోకి రానుందని ఇదివరకే ప్రకటించారు. అందుకు తగ్గట్లే చిత్రీకరణ చేస్తున్నారు. ఈ చిత్రం తర్వాత త్రివిక్రమ్, నెల్సన్ దిలీప్ కుమార్‌తో కొత్త ప్రాజెక్టులు పట్టాలెక్కనున్నాయి.

