Jubilee Hills Azharuddin Cabinet: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక..అజహరుద్దీన్‌కు మంత్రి పదవి వెనుక పెద్ద వ్యూహమే కన్పిస్తోంది. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నేపధ్యంలో తీసుకున్న నిర్ణయంగా అందరికీ తెలిసిందే అయినా తెరవెనుక మరో వ్యూహం కూడా ఉందని తెలుస్తోంది. గవర్నర్ తిరస్కరిస్తే ఆ వ్యూహం అమలు చేసేందుకు కాంగ్రెస్ సిద్ధమైందని సమాచారం.
2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి 16 వేల ఓట్లతో ఓడిపోయిన క్రికెటర్ అజహరుద్దీన్ ఇప్పుడు మరోసారి అదే నియోజకవర్గం ఉప ఎన్నిక సందర్భంగా వార్తల్లో నిలుస్తున్నారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కేవలం పది రోజుల్లో ఉందనగా తెలంగాణ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అజహరుద్దీన్‌కు మంత్రి పదవి ఖరారు చేయడమే కాకుండా ఆగమేఘాలపై ఈనెల 31న ప్రమాణ స్వీకారం చేయిస్తోంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్న 1.20 లక్షల మంది ముస్లిం ఓటర్ల కోసమే కాంగ్రెస్ ఇలా చేస్తోందంటూ బీఆర్ఎస్ విమర్శలు మొదలెట్టింది. ప్రభుత్వం ఏర్పడిన రెండేళ్ల తరువాత కాంగ్రెస్ ప్రభుత్వానికి ముస్లింలు ఇప్పుడు గుర్తొచ్చారా అంటూ ప్రశ్నిస్తోంది. ఎందుకంటే షబ్బీర్ అలీ వంటి సీనియర్ నేతల్ని కూడా మంత్రివర్గంలో తీసుకున్న పరిస్థితి లేదు. ఇప్పుడు హఠాత్తుగా జూబ్లీహిల్స్ ఉపఎన్నిక మరో 10 రోజుల్లో ఉందనగా ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం ముస్లిం ఓట్లే అంటున్నారు.
అజహరుద్దీన్ ఎమ్మెల్సీకు ఆమోదం లభిస్తుందా లేదా
వాస్తవానికి అజహరుద్దీన్ పేరును ఎమ్మెల్సీగా గవర్నర్ కోటాలో ప్రభుత్వం నామినేట్ చేసింది. దాదాపు నెలన్నర నుంచి గవర్నర్ ఆమోదించకుండా పెండింగులో పెట్టారు. స్పోర్ట్స్ కేటగరీలో నామినేట్ చేసిన అజహరుద్దీన్ అభ్యర్ధిత్వాన్ని గవర్నర్ తిరస్కరించే అవకాశాలు లేకపోలేదు. గతంలో పాడి కౌశిక్ రెడ్డి, దాసోజు శ్రవణ్ విషయంలో అదే జరిగింది. అందుకే ఇప్పుడు కూడా గవర్నర్ తిరస్కరించవచ్చంటున్నారు. అందుకే నెలన్నర నుంచి అజహరుద్దీన్ ఎమ్మెల్సీ అంశం పెండింగులో ఉందని తెలుస్తోంది.
ప్రత్యామ్నాయం ఏంటి
నిబంధనల ప్రకారం మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఆరు నెలల్లోగా ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీగా ఎన్నిక కావల్సి ఉంటుంది. కానీ రాష్ట్రంలో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యే పరిస్థితి లేదు. ఎమ్మెల్సీ మరో ఏడాది వరకూ ఖాళీ కాదు. ఈ క్రమంలో ఆరు నెలల్లోగా అజహరుద్దీన్ ఎమ్మెల్సీగా ఎన్నిక కాకుంటే మంత్రిపదవి కోల్పోతారు. అదే జరిగే పరిస్థితి ఉంటే ఆరో నెలలో అజహరుద్దీన్ చేత రాజీనామా చేయించి..2-3 వారాల వ్యవధి తరువాత తిరిగి మంత్రివర్గంలో తీసుకోవచ్చు. అలా చేస్తే అప్పటి నుంచి మరో ఆరు నెలల సమయం లభిస్తుంది. అప్పటికీ గవర్నర్ ఆమోదించకుంటే ఏడాదిలో ఎలాగూ ఎమ్మెల్సీ ఖాళీలు ఉంటాయి. వాటిలో ఎక్కడైనా సరే అజహరుద్దీన్‌కు స్థానం కల్పించవచ్చు.
ఈ సాధ్యాసాధ్యాలు ఎలాగుంటాయి.. వర్కవుట్ అవుతాయా లేదా అనేది పక్కనబెడితే ప్రస్తుతానికి మాత్రం జూబ్లీహిల్స్ ఎన్నిక నుంచి గట్టెక్కేందుకు కాంగ్రెస్‌కు ఇంతకంటే మరో మార్గం కన్పించడం లేదు. ఎందుకంటే ఇటీవల కాలంలో తెలంగాణ ముస్లింలు కాంగ్రెస్ పార్టీకు దూరమౌతున్నారనే నివేదికలు వస్తున్నాయి. జూబ్లీహిల్స్ బరిలో ముస్లింలే కీలకం. అందుకే ఈ ఎన్నిక నుంచి గట్టెక్కాలంటే ఇంతకంటే మరో మార్గం లేదు. అందుకే అజహరుద్దీన్‌కు మంత్రి పదవిని హఠాత్తుగా ప్రకటించింది కాంగ్రెస్ ప్రభుత్వం.


