Jubilee Hills Bi polls: జూబ్లీహిల్స్ బై పోల్‌కు రంగం సిద్దమైంది. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది.అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు నువ్వా నేనా అన్నట్టు రాజకీయం నడుపుతున్నాయి. అభ్యర్థుల ఎంపికపై అన్ని పార్టీలు మల్లగుల్లాలు పడుతున్నాయి. ఈ క్రమంలోనే కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఓ కీలకమైన అప్‌డేట్ వచ్చింది. ఉప ఎన్నిక కోసం ఏ క్షణంలోనైనా నోటిఫికేషన్ షెడ్యూల్ విడుదల కాబోతున్నదన్న ప్రచారం వేళ ఈసీ కీలక అప్ డేట్ ఇచ్చింది. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో జరగనున్న ఉప ఎన్నికను పర్యవేక్షించడానికి కేంద్ర పరిశీలకులను నియమించినట్లు ఈసీఐ ఆదివారం తెలిపింది. బిహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు జమ్ము జమ్మూ & కాశ్మీర్ (బుడ్గామ్, హైరోటా), రాజస్థాన్ (అంట), ఝార్ఖండ్ (ఘట్సిలా), తెలంగాణ (జూబ్లీహిల్స్), పంజాబ్ (టార్న్ తరణ్), మిజోరం (దంపా), ఒడిశా (నువాపాడ) అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికల కోసం పరిశీలకులను నియమించింది.
470 మంది అధికారులు..
ఈ ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేలా కేంద్ర అబ్జర్వర్లుగా 470 మంది అధికారులను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. వీరిలో 320 మంది ఐఏఎస్, 60 మంది ఐపీఎస్, 90 మంది ఐఆర్ఎస్/ఐఆర్ఏఎస్/ఐసీఏఎస్ అధికారులు ఉన్నారు. కేంద్ర ఎన్నికల సంఘానికి వీళ్లు అన్నీ తామై వ్యవహరిస్తారు. ఎన్నికలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను పర్యవేక్షించనున్నారు. న్నికల ప్రక్రియ నిష్పక్షపాతంగా జరిగేలా సంబంధించిన వివరాలు వీరు నేరుగా ఎన్నికల కమిషన్‍కు నివేదిస్తారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 324, ప్రజాప్రాతినిధ్య చట్టం 1951 లోని సెక్షన్ 20బి ప్రకారం ఈ పరిశీలకులను నియమించినట్లు ఈసీ తెలిపింది.
బీహార్‌తో పాటే జూబ్లీహిల్స్ బైపోల్..
బీహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటే జూబ్లీహిల్స్ బై పోల్ నిర్వహించేందుకు ఈసీ కసరత్తు చేస్తోంది. ఈ మేరకు దీపావళి తర్వాత ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయబోతున్నట్లు వర్గాలు తెలిపారు. ఇక ఈ ఎన్నికల్లో గెలిచి తీరేందుకు ప్రధాన పార్టీలు సిద్ధం అవుతుండటంతో రాష్ట్ర రాజకీయం ఇంట్రెస్టింగ్ గా మారింది. కాగా, ఈ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మధ్య గట్టి పోటీ ఉండనుంది. మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునితను ఎమ్మెల్యే అభ్యర్థిగా బీఆర్‌ఎస్ ప్రకటించింది. సెంటిమెంట్ కలిసొస్తుందని పార్టీ భావిస్తోంది. ఇక, కాంగ్రెస్‌లో టికెట్ కోసం గట్టి పోటీ నెలకొంది. టికెట్ ఎవరిని వరిస్తుందనే విషయం ఆసక్తికరంగా మారింది. అధికారంలోకి వచ్చిన అనంతరం అధికార పార్టీ ఎదుర్కొంటున్న మొదటి ఎన్నిక ఇదే కావడంతో సత్తా చాటాలని డిసైడైంది. అటు, బీజేపీ సైతం గట్టి పోటీ ఇచ్చేందుకు పావులు కదుపుతోంది.


