Saturday, November 15, 2025
HomeతెలంగాణJubilee Hills By Poll 2025: ముగిసిన జూబ్లీహిల్స్ పోలింగ్.. సాయంత్రానికల్లా పోలింగ్‌ ఎంత నమోదైందంటే?

Jubilee Hills By Poll 2025: ముగిసిన జూబ్లీహిల్స్ పోలింగ్.. సాయంత్రానికల్లా పోలింగ్‌ ఎంత నమోదైందంటే?

Jubilee Hills By Election 2025 Voting Day Live Updates: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ ముగిసింది. ఇవాళ్టి సాయంత్రం 5 గంటల వరకు దాదాపు 47.16 శాతం పోలింగ్‌ నమోదైంది. ఈ ఉప ఎన్నికలో సుమారు 4.01 లక్షల మంది ఓటర్లు ఉండగా.. వీరిలో దాదాపు సగం మంది ఓటింగ్‌కు దూరంగా ఉండటం ఆందోళన రేకెత్తిస్తోంది. ఈ నియోజకవర్గంలో మొత్తం 407 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా.. ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమైన పోలింగ్ సాయంత్ర ఆరు గంటల వరకు కొనసాగింది. సాయంత్రం 5 గంటల వరకు 47.16 శాతం ఓటింగ్ నమోదైంది. ఆరు గంటల తర్వాత పోలింగ్ కేంద్రాల్లోకి వెళ్లి క్యూ లైన్‌లో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నారు. షేక్‌పేట్‌లోని కొన్ని పోలింగ్ కేంద్రాల్లో గొడవ చేసిన వారిపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. పలు పోలింగ్ బూత్‌ల్లో చనిపోయిన వారి పేర్లతో దొంగ ఓట్లు వేస్తున్నారని ఆరోపిస్తూ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత రోడ్డుపై బైఠాయించారు. యూసఫ్ గూడలోని కృష్ణ నగర్ పోలింగ్ బూత్ ముందు మాగంటి సునీత బీఆర్‌ఎస్‌ నేతలతో కలిసి ఆందోళనకు దిగారు.

- Advertisement -

డ్రోన్ల ద్వారా భద్రతా ఏర్పాట్ల పర్యవేక్షణ..

ఈ ఎన్నికల బరిలో మొత్తం 58 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఎక్కువ మంది అభ్యర్థులు ఉండటంతో ప్రతి పోలింగ్ కేంద్రంలో ఎన్నికల అధికారులు 4 ఈవీఎంలు ఏర్పాటు చేశారు. సుమారు 2 వేల మంది పోలీసు సిబ్బంది భద్రతా విధులు నిర్వర్తిస్తున్నారు. శాంతిభద్రతలను పర్యవేక్షించడానికి సీఆర్‌పీఎఫ్‌ బలగాలను కూడా మోహరించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తమ ఓటు హక్కు వినియోగించుకునేలా ఎలక్షన్‌ కమిషన్‌ పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. దొంగ ఓట్లు, గొడవలు జరుగకుండా అధికారులు కఠిన నిఘా పెట్టారు. డ్రోన్ల ద్వారా భద్రతా పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. ఎక్కడైనా ఈవీఎంలు పనిచేయకపోతే వెంటనే బ్యాకప్‌ యంత్రాలను సిద్ధంగా ఉంచామని ఎన్నికల అధికారులు తెలిపారు. అయితే, కొన్ని చోట్ల ఈవీఎంలు మోరాయించడంతో ఓటింగ్‌ పక్రియకు ఆటంకం ఏర్పడింది. వెంటనే అధికారులు కొత్త ఈవీఎంలను ఏర్పాటు చేసి పోలింగ్‌ను కొనసాగించారు. పోలింగ్ ప్రక్రియ నిర్వహణ కోసం 2,060 మంది ఎన్నికల సిబ్బందిని నియమించారు. మధ్యాహ్నం 1 గంటల వరకు మొత్తం ఓటర్లలో సగం మంది కూడా ఓటు వేయలేదు. ఓటర్ల పెద్దగా తమ ఓటు హక్కుని ఉపయోగించుకోడానికి పోలింగ్ బూత్‌లకు రాలేదు. ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు నవంబర్ 14న కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో జరగనుంది. అయితే, పలు పోలింగ్ బూత్‌ల వద్ద బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. చెదురుముదురు సంఘటనలు మినహా పోలింగ్‌ ప్రశాంతంగా ముగియడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad