Congress : జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉపఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో రాజకీయ వేడి ఊపందుకుంది. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్ ఈ స్థానం నుంచి పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. అయితే, కేవలం టికెట్‌తో ఆగకుండా, ఒక ఆసక్తికరమైన షరతు విధించడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. తాను గెలిస్తే కచ్చితంగా మంత్రి పదవి ఇవ్వాలని ఆయన పార్టీ అధిష్ఠానాన్ని డిమాండ్ చేశారు.
తాను జూబ్లీహిల్స్‌లో స్థానికుడినని, గతంలో సికింద్రాబాద్ ఎంపీగా గెలిచి ఈ ప్రాంత అభివృద్ధికి ఎంతో కృషి చేశానని అంజన్ కుమార్ యాదవ్ గుర్తు చేశారు. ఈ ఉప ఎన్నికలో పోటీ చేయాలని స్థానిక ప్రజలు కోరుకుంటున్నారని, పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు తాను అండగా నిలిచానని ఆయన పేర్కొన్నారు. తమ సామాజిక వర్గానికి మంత్రివర్గంలో సరైన ప్రాతినిధ్యం లభించలేదని అసంతృప్తి వ్యక్తం చేస్తూ, జూబ్లీహిల్స్ టికెట్‌తో పాటు, గెలిచిన తర్వాత మంత్రి పదవిని కూడా డిమాండ్ చేశారు.
Vahana Mitra : ఇవి ఉంటేనే ఆటో డ్రైవర్లకు వాహన మిత్ర సాయం
మరోవైపు, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కూడా ఈ ఉపఎన్నికపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను కాంగ్రెస్‌లోనే ఉన్నానని, పార్టీ అధిష్ఠానం ఆదేశిస్తే ఏ నియోజకవర్గం నుంచైనా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని దానం నాగేందర్ స్పష్టం చేశారు. పార్టీ ఫిరాయింపు ఆరోపణలపై స్పీకర్ నుంచి ఇంకా ఎలాంటి నోటీసులు అందలేదని, నోటీసులు వచ్చాక స్పందిస్తానని ఆయన తెలిపారు.
అంజన్ కుమార్ యాదవ్ షరతు, దానం నాగేందర్ వ్యాఖ్యలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో అంతర్గత వర్గపోరుకు దారితీసే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. జూబ్లీహిల్స్ టికెట్ ఎవరికి దక్కుతుంది, అంజన్ కుమార్ యాదవ్ షరతును అధిష్ఠానం అంగీకరిస్తుందా అనేది వేచి చూడాలి.


