Jubilee Hills by Election Campaign by Ministers Uttam and Ponnam: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల ప్రచారం ఊపందుకుంది. మూడు ప్రధాన పార్టీలు ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఎలాగైనా గెలిసి తీరాలని అన్ని పార్టీల కీలక నేతలు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో గల్లి గల్లీ తిరుగుతూ ప్రచారం నిర్వహిస్తున్నారు. దాదాపు బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల కీలక నేతలు కాలనీల్లో పర్యటిస్తూ ప్రచారం చేస్తున్నారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. గురువారం యూసుఫ్‌గూడ డివిజన్‌లో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, కాంగ్రెస్ సీనియర్ నేత అజారుద్దీన్, ఏఐసీసీ సెక్రటరీ సంపత్, మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్ సునీతా ముదిరాజ్‌లు ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
సన్నబియ్యంతో పేదల సంతోషం రెట్టింపు..
ప్రచారంలో భాగంగా యూసుఫ్ గూడలో కూరగాయల షాపు ఓనర్‌తో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ ముచ్చటించారు. గత రెండేళ్లుగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి గురించి ఇరువురు చర్చించారు. ముఖ్యంగా కొత్త రేషన్ కార్డులు, సన్న బియ్యం స్కీం గురించి ప్రజలు ఎక్కువగా మాట్లాడుకుంటున్నారని ట్విట్టర్ వేదికగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఓటర్లు అందరూ తమవైపే ఉన్నారని మంత్రి చెప్పుకొచ్చారు.
Also Read: https://teluguprabha.net/business/bank-holidays-in-november-plan-according-to-this-list/
హోటల్‌లో దోశలు వేసిన మంత్రులు..
కూరగాయల షాపుకు వెళ్లిన అనంతరం మంత్రులు ఉత్తమ్, పొన్నం ప్రభాకర్ యూసఫ్‌గూడ డివిజన్‌లోని ఓ హోటల్‌కు వెళ్లారు. అక్కడ మంత్రులు దోశ వేస్తూ అందరినీ ఆకట్టుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అనంతరం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ మెజార్టీతో గెలువబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు కాంగ్రెస్ పాలనపై సంతోషంగా ఉన్నారని చెప్పారు. ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చుకుంటూ వెళ్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలో అర్హులందరికీ రేషన్ కార్డు అందజేసిన ఘనత తమదేనని చెప్పుకొచ్చారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం పదేళ్ల పాటు రేషన్ కార్డులు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టిందని గుర్తు చేశారు. రాష్ట్రంలో ప్రతి ఒక్క కుటుంబానికి సన్న బియ్యం స్కీ అమలు అవుతోందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేస్తుందని.. ప్రజలు కాంగ్రెస్ పాలనపై సంతోషంగా ఉన్నారని చెప్పుకొచ్చారు. అన్ని కులాలను, మతాలను సమానంగా చూసే పార్టీ ఒక్క కాంగ్రెస్ మాత్రమే అన్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో గెలుపు కాంగ్రెస్ పార్టీదే అని ధీమా వ్యక్తం చేశారు.


