Jubilee Hills by-election 2025 : హోరాహోరీ ప్రచారం.. వాడీవేడి విమర్శలు.. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థుల అలుపెరగని పర్యటనలు.. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల ప్రచార పర్వానికి తెరపడింది. శనివారం సాయంత్రంతో మైకులు మూగబోయాయి. ఇక మిగిలింది ఓటరు తీర్పే. బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ హఠాన్మరణంతో అనివార్యమైన ఈ ఉపఎన్నికలో అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్దేశించేందుకు రంగం సిద్ధమైంది. మరి రికార్డు స్థాయిలో 58 మంది అభ్యర్థులు పోటీ పడుతున్న ఈ బరిలో ఓటరు నాడి ఎలా ఉంది? ఎవరికి పట్టం కట్టనున్నారు?
రికార్డు స్థాయిలో 58 మంది బరిలో : జూబ్లీహిల్స్ నియోజకవర్గ చరిత్రలో ఇంతమంది అభ్యర్థులు పోటీ పడటం ఇదే ప్రథమం. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థులతో పాటు, పెద్ద సంఖ్యలో స్వతంత్రులు, రైతులు బరిలో నిలవడంతో పోటీ రసవత్తరంగా మారింది. గత 2023 సాధారణ ఎన్నికల్లో కేవలం 19 మంది మాత్రమే పోటీ చేశారు. ఈసారి అభ్యర్థుల సంఖ్య అమాంతం పెరగడం ఎన్నికల నిర్వహణకు సవాలుగా మారింది.
ఓటరు నాడి ఎటువైపు : నియోజకవర్గ పరిధిలో మొత్తం 4,01,365 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో పురుషులు 2,08,561 మంది కాగా, మహిళలు 1,92,779 మంది ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఈసారి 2,383 ఓట్లు పెరిగాయి. ముఖ్యంగా 18-19 ఏళ్ల మధ్య వయసున్న యువ ఓటర్లు 6,859 మంది ఉండటం, మహిళా ఓటర్ల సంఖ్య కూడా పెరగడంతో ఓటింగ్ శాతం పెరుగుతుందని అధికారులు ఆశిస్తున్నారు. గత ఎన్నికల్లో కేవలం 47.58 శాతం పోలింగ్ మాత్రమే నమోదు కాగా, ఈసారి దాన్ని 50 శాతం దాటించేందుకు ఎన్నికల సంఘం విస్తృత ప్రచారం చేపట్టింది.
పకడ్బందీగా ఎన్నికల ఏర్పాట్లు: ఆర్వీ కర్ణన్ : నవంబర్ 11న జరగనున్న పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్ తెలిపారు. “నియోజకవర్గ పరిధిలో 139 ప్రాంతాల్లో 407 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశాం. వీటిలో 226 కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించి, ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశాం. తొలిసారిగా డ్రోన్లతో పటిష్టమైన నిఘా పెడుతున్నాం. అన్ని కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ నిర్వహిస్తాం,” అని ఆయన స్పష్టం చేశారు. వృద్ధులు, దివ్యాంగుల కోసం ఇప్పటికే హోమ్ ఓటింగ్ ప్రక్రియను పూర్తి చేశామని, 103 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని తెలిపారు. ఎన్నికల సామగ్రిని యూసఫ్‌గూడ ఇండోర్ స్టేడియం నుంచి పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు.


