Saturday, November 15, 2025
HomeTop StoriesJubilee Hills: నేటితో ఉప ఎన్నిక ప్రచారానికి తెర.. అంతుచిక్కని ప్రజానాడి!

Jubilee Hills: నేటితో ఉప ఎన్నిక ప్రచారానికి తెర.. అంతుచిక్కని ప్రజానాడి!

Jubilee Hills by-election campaign: జూబ్లీహిల్స్‌ ఉపఎన్నిక ప్రచారానికి నేటి సాయంత్రంతో తెరపడనుంది. మరో రెండు రోజుల్లో పోలింగ్‌ జరగనుంది. అయినప్పటికీ ఓటరు మదిలో ఏముందో తెలియక అభ్యర్థులు, రాజకీయ పార్టీల నాయకులు తలపట్టుకుంటున్నారు. ఎన్నికల వేళ ఓటరు దేవుళ్లను ప్రసన్నం చేసుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు.

- Advertisement -

సర్వశక్తులూ ఒడ్డుతున్న పార్టీలు: జూబ్లీహిల్స్‌లో నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌ తరపున గెలిచిన ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ మరణంతో ఈ ఉపఎన్నిక జరుగుతుంది. ఈ ఎన్నికలో ఎలాగైనా గెలవాలని ప్రధాన పార్టీలు సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. ప్రత్యేకించి అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్‌ఎస్‌ ఉపఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. నువ్వా నేనా అన్నట్టుగా ఇరుపార్టీల నేతలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. మరోవైపు బీజేపీ సైతం తనదైన శైలిలో గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తోంది. అయితే ఇంతవరకు ఏ ఒక్కపార్టీకి ప్రజానాడి అంతుచిక్కడంలేదు. దీంతో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందో ఇప్పటికీ తెలియడం లేదు.

అంతుచిక్కని ప్రజానాడి: సుమారు 4 లక్షల ఓటర్లు ఈ నియోజకవర్గంలో ఉన్నారు. అయితే వారు తమ మనోగతాన్ని వెల్లడించేందుకు అస్సలు ఆసక్తి చూపడం లేదు. ఒకవేళ కాంగ్రెస్‌ గెలిస్తే ఆ పార్టీ ప్రజాపాలనకు ఓటర్లు జై కొట్టినట్టేనని కాంగ్రెస్‌ నేతలు అంటున్నారు. బీఆర్‌ఎస్‌ గెలిస్తే ప్రజలు మళ్లీ కేసీఆర్‌ రావాలని కోరుతున్నారనే సందేశం బలంగా తెలుగుప్రజల్లోకి వెళ్తుందని ఆ పార్టీ నేతలు నమ్ముతున్నారు. ప్రజావ్యతిరేకతకు ఈ ఉపఎన్నిక ఫలితం రెఫరెండం అవుతుందని బీఆర్ఎస్‌ నేతలు అంటున్నప్పటికీ.. కాంగ్రెస్‌ అభ్యర్థి అయిన నవీన్‌ యాదవ్‌కు కొంత అనుకూల పవనాలు వీస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా. దీంతో గెలుపు ఎవరి సొంతం అనేది.. ఇరు పార్టీలకు అంతుచిక్కడం లేదు.

ఏకంగా ఆరు రోజులపాటు ప్రచారం చేసిన సీఎం: రేవంత్‌రెడ్డి స్వయంగా రంగంలోకి దిగి మూడు విడతల్లో ఏకంగా ఆరు రోజులపాటు నియోజకవర్గమంతా చుట్టారు. దీంతో ఈ ఉపఎన్నిక గెలుపు కాంగ్రెస్‌ పార్టీకి ఎంత అవసరమో అద్దంపడుతోంది. మంత్రులకు సైతం డివిజన్లవారీగా ప్రచార బాధ్యతలను టీపీసీసీ అప్పగించారు. వారు ఎమ్మెల్యేలతో కలిసి ఇంటింటి ప్రచారం చేపట్టారు. అయితే రేవంత్‌ రెడ్డితో సహా మంత్రులు.. కేసీఆర్‌ కుటుంబమే లక్ష్యంగా ప్రచారం చేశారు. వారు గత రెండేళ్లలో చేసిన అభివృద్ధిని ఎక్కడా చెప్పే ప్రయత్నం చేయలేదు. ప్రచారంలో సీఎం రేవంత్‌ రెడ్డి అనుసరించిన వ్యూహాలు ఎంతవరకు సత్ఫలితాన్ని ఇస్తాయో వేచిచూడాల్సిందే.

కాంగ్రెస్‌ పార్టీకి ప్రతికూల అంశాలు: హైడ్రా చేపట్టిన పేదల ఇళ్ల కూల్చివేతలు, ఆరు గ్యారంటీల అమల్లో తలెత్తిన లోపాలు, అర్హులందరికీ రేషన్‌ కార్డులు పూర్తిస్థాయిలో అందకపోవడం వంటి అంశాలు కాంగ్రెస్‌ పార్టీకి ప్రతికూల అంశాలుగా మారే అవకాశం ఉంది. ముఖ్యంగా కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన ఈ రెండేళ్లలో ప్రజలు ఆశించిన రీతిలో పాలన సాగడంలేదని.. ప్రజలు గ్రహించినట్టుగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అందుకు తగ్గట్టే ఇప్పటివరకు వెలువడిన సర్వేలన్నీ విపక్ష బీఆర్‌ఎస్‌ గెలిచే అవకాశం ఉందని పేర్కొంటున్నాయి. కానీ అదే సమయంలో నవీన్‌ యాదవ్‌ స్థానికులకు కొన్నేళ్లుగా చిరపరిమితుడు కావడం.. కాంగ్రెస్‌ పార్టీకి కలిసి వచ్చే అంశమని అంటున్నారు. అలాగే సుమారు 30 శాతం ఉన్న ముస్లిం ఓటర్లను తమవైపు తిప్పుకోవడానికి కాంగ్రెస్‌ పార్టీ అజహరుద్దీన్‌కు మంత్రి పదవి ఇవ్వడం కొసమెరుపు.

సారే మళ్లీ కావాలి: ఈ ఎన్నికలో గెలుపుపై బీఆర్‌ఎస్‌ ధీమాతో ఉంది. అధికార కాంగ్రెస్‌పై ఉన్న ప్రజావ్యతిరేకతే తమకు బలం అన్నట్టుగా వారి ప్రచారం సాగుతుంది. రెండేళ్ల కాంగ్రెస్‌ పాలనను పదేళ్ల కేసీఆర్‌ పాలనతో పోలుస్తూ ఓటర్లను తమ వైపు తిప్పుకోవడానికి కేటీఆర్‌తో పాటుగా హరీశ్‌ రావు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. కేసీఆర్‌ సారు కావాలంటే కారుకు ఓటేయాలని ఓటర్లను కోరుతున్నారు. ప్రత్యేకించి హైదరాబాద్‌ను తాము చెప్పుకోదగ్గ స్థాయిలో అభివృద్ధి చేశామని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ ప్రతి మీటింగ్‌లో చెబుతున్నారు. మాజీ మంత్రి హరీశ్‌రావు సైతం ప్రచారంలో కాంగ్రెస్‌ ఆరు గ్యారంటీల అంశాన్నే పదే పదే ప్రస్తావిస్తూ.. కాంగ్రెస్‌ పాలనను ఎండగడుతున్నారు. నగరం నలుమూలలా బీఆర్‌ఎస్‌ హయాంలో ఏర్పడిన 42 ఫ్లైఓవర్ల నిర్మాణం గురించి ప్రచారంలో ప్రజలకు గుర్తుచేస్తున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని ప్రజలకు ఉచిత తాగునీరు ఇవ్వడం, ఆ పార్టీ హయాంలో ఐటీ సంస్థలకు ఇచ్చిన తోడ్పాటు వంటి అంశాలు బీఆర్‌ఎస్‌కు ఈ ఎన్నికలో కలిసి వచ్చే అంశాలు కావొచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అంతే కాకుండా నిత్యం కాంగ్రెస్‌ మంత్రులు ఒకరిపై ఒకరు బహిరంగంగా నోరు పారేసుకోవడంతో ప్రజలు విసుగేత్తి పోయారని తెలుస్తోంది. ప్రజా సమస్యలను పక్కనపెట్టి.. వాటాల కోసం మంత్రులు ఇంతలా దిగజారడం ఏంటని జూబ్లీహిల్స్‌ ఓటర్లతో పాటుగా యావత్‌ తెలంగాణ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వంలోని మంత్రుల అంతర్గత విభేదాలు సైతం ఓటర్లపై ప్రభావం చూపే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకుల అంచనా. ఏది ఏమైనప్పటికీ నేటితో ఉప ఎన్నిక ప్రచారానికి తెరపడుతుంది. అయినా ప్రజానాడి అంతుచిక్కడంలేదని పోటీల ఉన్న అభ్యర్థులతో పాటుగా రాజకీయ విశ్లేషకులు తలపట్టుకుంటున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad