Jubilee Hills by-election: జూబ్లీహిల్స్ బై పోల్ ఇవాళ ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. ఉదయం 6:30 గంటలకు ఆయా పార్టీ ఏజెంట్ల సమక్షంలో మాక్ పోలింగ్ నిర్వహించిన అనంతరం.. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగనుంది. క్యూలో ఉన్న ఓటర్లకు 6 గంటల తర్వాత కూడా ఓటు వేసే అవకాశం కల్పించనున్నట్లు ఎన్నికల అధికారులు స్పష్టం చేశారు.
బరిలో 58 మంది ఉన్నా పోటీ వారి మధ్యే: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో మొత్తం 58 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అయినప్పటికీ ముగ్గురి మధ్యే ప్రధాన పోటీ ఉంది. బీఆర్‌ఎస్ తరఫున మాగంటి గోపీనాథ్ భార్య సునీత, కాంగ్రెస్ పక్షాన నవీన్ యాదవ్, భాజపా తరఫున లంకల దీపక్‌రెడ్డి పోటీలో ఉన్నారు. గెలుపుపై ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ ఉప ఎన్నికను అధికార పార్టీతో పాటుగా ప్రతిపక్షాలైన బీఆర్ఎస్, బీజేపీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. దీంతో జూబ్లీహిల్స్ ఓటర్లు ఇచ్చే తీర్పుపై రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఆసక్తి నెలకొంది.
ఎన్నికల కమిషన్ చర్యలు: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక సందర్భంగా ఎన్నికల కమిషన్ భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేసింది. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ను కఠినంగా అమలు చేస్తోంది. ఓటర్లు ఈపీఐసీ వెబ్‌సైట్ లేదా వోటర్ హెల్ప్‌లైన్ యాప్ ద్వారా తమ పోలింగ్ బూత్ వివరాలను తనిఖీ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. ఈ ఉపఎన్నిక కోసం నాలుగు బ్యాలెట్ యూనిట్లను వినియోగిస్తున్నట్టుగా ఎన్నికల కమిషన్ పేర్కొంది.
Also Read:https://teluguprabha.net/telangana-news/jubilee-hills-bypoll-security-central-forces-ec/
ఈ నెల 14న కౌంటింగ్: బీఆర్ఎస్ నుంచి హ్యాట్రిక్ విజయాలు సాధించిన ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో ఈ ఉపఎన్నిక జరుగుతున్న విషయం తెలిసిందే. జూబ్లీహిల్స్ బై పోల్ కోసం అక్టోబర్ 13న నోటిఫికేషన్ విడుదల కాగా.. అక్టోబర్ 21 నామినేషన్ల దాఖలుకు తుదిగడువు విధించారు. ప్రచార సమయం అనంతరం నేడు (నవంబర్ 11) పోలింగ్ నిర్వహిస్తున్నారు. 14న కౌంటింగ్, అదేరోజు ఫలితం ప్రకటనతో ఎన్నికల కోడ్ ముగియనున్నట్టుగా ఉపఎన్నికల నోటిఫికేషన్‌లో కేంద్ర ఎన్నికల కమిషన్ పేర్కొంది.


