Jubilee Hills By Election Special story: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదలైంది. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో ఉపఎన్నిక అనివార్యమైంది. ఇప్పటికే బీఆర్‌ఎస్, కాంగ్రెస్ తమ అభ్యర్థులను ప్రకటించాయి. బీఆర్‌ఎస్ మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునితకు టికెట్ ఖరారు చేసింది. కాంగ్రెస్ నవీన్ యాదవ్‌కు టికెట్ కేటాయించింది. ఇక, బీజేపీ సైతం గట్టి పోటీనిచ్చేందుకు సిద్ధమవుతోంది. అయితే, ప్రధాన పోటీ మాత్రం బీఆర్‌ఎస్, కాంగ్రెస్ మధ్య ఉండనుంది. ఈ ఎన్నికలో గెలిచి స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలని కాంగ్రెస్ భావిస్తుండగా.. బీఆర్‌ఎస్ సిట్టింగ్ సీటును నిలబెట్టుకోవాలని గట్టి ప్రయత్నం చేస్తోంది. ఈ గెలుపు ద్వారా అధికార పార్టీకి గట్టి షాక్ ఇవ్వాలని యోచిస్తోంది. ఈ రెండు పార్టీల మధ్య బీజేపీ సైతం గణనీయమైన ఓట్లను సాధించి గ్రేటర్‌లో తన పట్టు నిలుపుకోవాలని చూస్తోంది. ఏదేమైనా ఈ ఉప ఎన్నిక అన్ని పార్టీలకు సవాలుగా మారింది. అయితే, ఎక్కువగా సినీ రంగ ప్రముఖులు, సెటిలర్లు, ముస్లిం మైనార్టీలు ఎక్కువగా ఉండే జూబ్లీహిల్స్‌లో ఎవరిని విజయం వరించనుంది? అనేది ఆసక్తికరంగా మారింది. మరి గత ఎన్నికల్లో 2009, 2014, 2018, 2023 ఎన్నికల్లో ఏ పార్టీ అభ్యర్థులు గెలిచారు? ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయనే విషయాలను పరిశీలిద్దాం.
2009 నుండి 2023 వరకు ఓటింగ్ సరళి..
2009 ఎన్నికల్లో దివంగత నేత పీజేఆర్ కుమారుడు పి. విష్ణువర్థన్ రెడ్డి (కాంగ్రెస్) 54519 ఓట్లు సాధించారు. ఈ ఎన్నికల్లో ఆయన తన ప్రత్యర్థి మహమ్మద్ సలీమ్(తెలుగుదేశం)పై 22 వేల పైచిలుకు ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఈ ఎన్నికలో మొత్తం 1,36,893 ఓట్లు పోలయ్యాయి.
ఇక, 2014 ఎన్నికల్లో మాగంటి గోపీనాథ్ (తెలుగుదేశం) 50,896 ఓట్లు సాధించారు. ఈ ఎన్నికల్లో తన ప్రత్యర్థి నవీన్ యాదవ్ (ఎంఐఎం) అభ్యర్థిపై 9 వేల పైచిలుకు ఓట్ల తేడాతో విజయం సాధించారు. నవీన్ యాదవ్‌కు 33642 ఓట్లు పోలై రెండో స్థానంలో నిలిచారు. ఇక, విష్ణు వర్థన్ రెడ్డి (కాంగ్రెస్) మూడో స్థానానికి పరిమితమయ్యారు. ఈ ఎన్నికలో మొత్తం 164331 ఓట్లు పోలయ్యాయి.
ఇక, 2018 ఎన్నికల్లో మాగంటి గోపీనాథ్ (బీఆర్‌ఎస్) గెలుపొందారు. ఆయన 68937 ఓట్లు సాధించారు. తన సమీప ప్రత్యర్థి పీ. విష్ణు వర్థన్ రెడ్డి 52975 ఓట్లు సాధించగా.. ఆయనపై 16 వేల పైచిలుకు ఓట్ల తేడాతో విజయం సాధించారు.
ఇక, 2023 ఎన్నికల్లో మాగంటి గోపీనాథ్ (బీఆర్‌ఎస్) విజయం సాధించారు. 80549 ఓట్లతో మొహమ్మద్ అజారుద్ధీన్ (కాంగ్రెస్)పై ఘన విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో అజారుద్ధీన్ 64212 ఓట్లు సాధించగా.. మాగంటి ఆయనపై 16 వేల పైచిలుకు ఓట్లతో గెలుపొందారు. కాగా, ఈ ఎన్నికలో మొత్తం 181938 ఓట్లు పోలయ్యాయి.


