Jubilee Hills Bypoll : భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) అభ్యర్థి మాగంటి సునీత విజయం కోసం జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో నాయకులంతా కలిసికట్టుగా పనిచేయాలని పార్టీ కీలక నేతలు కేటీఆర్ , హరీశ్‌రావు దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతను సమర్థంగా వాడుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా వారు ఉద్ఘాటించారు. బుధవారం జరిగిన ఈ కీలక సమావేశంలో అభ్యర్థి మాగంటి సునీతతో పాటు దివంగత మాగంటి గోపీనాథ్ సోదరుడు వజ్రనాథ్ సహా పలువురు ముఖ్య నేతలు పాల్గొన్నారు.
ఎన్నికల బాధ్యతలు అప్పగించిన మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇన్‌ఛార్జిలు పూర్తి సమన్వయంతో పనిచేయాలని, తమకు అప్పగించిన డివిజన్లలో పూర్తిస్థాయిలో బాధ్యతలు నిర్వర్తించాలని కేటీఆర్, హరీశ్‌రావు ఆదేశించారు. ప్రచారంలో ‘బాకీ కార్డుల’ ద్వారా ప్రభుత్వం నెరవేర్చని హామీలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని సూచించారు. ఉదయం, సాయంత్రం వేళల్లో విధిగా పాదయాత్రలు నిర్వహించాలని, బూత్ కమిటీలు నిరంతరం ఓటర్లతో సంప్రదింపులు జరపాలని స్పష్టం చేశారు.
జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో బీఆర్‌ఎస్ గెలిస్తేనే రాష్ట్ర ప్రభుత్వానికి ‘చెక్’ పడుతుందని నాయకులు గట్టిగా పేర్కొన్నారు. ప్రచారం చివరి దశలో భారీ ఎత్తున రోడ్ షోలు నిర్వహించాలని నిర్ణయించారు. పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ప్రచారానికి రావాలని కొందరు నేతలు ప్రతిపాదించినట్లు సమాచారం. ఈ ఎన్నికను పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని, గెలుపు కోసం వ్యూహాత్మకంగా ముందుకు సాగాలని నిర్ణయించింది.


