CM Revanth Reddy: జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నిక (Jubilee Hills Bypoll) ప్రచారం అగ్గి రాజేస్తోంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపు కోసం స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రంగంలోకి దిగి, బోరబండలో ఏర్పాటు చేసిన మీటింగ్‌లో ప్రతిపక్షాలపై పదునైన విమర్శలతో విరుచుకుపడ్డారు. ఈ ఉపఎన్నిక సెంటిమెంట్‌కు కాదని, అభివృద్ధికి అవకాశం ఇవ్వాల్సిన సమయమని ఓటర్లను కోరారు.
BRS-BJPపై రేవంత్‌రెడ్డి ఫైర్:
సీఎం రేవంత్‌రెడ్డి ప్రసంగంలో BRS, బీజేపీ పార్టీల మధ్య ఉన్న ‘ఫెవికాల్ బంధాన్ని’ బట్టబయలు చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో BRS నేతలు బీజేపీకి ఓట్లు వేయించారని, ఈ రెండు పార్టీల కుమ్మక్కు రాజకీయాలను ప్రజలు గమనించాలని సూచించారు. BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ఉద్దేశించి చెల్లికి అన్నం పెట్టని వ్యక్తి.. చిన్నమ్మ బిడ్డకు బంగారు గాజులు చేయిస్తాడట అంటూ పరోక్షంగా పీజేఆర్ కుటుంబానికి జరుగుతున్న అన్యాయాన్ని ప్రస్తావించారు. వేల కోట్ల అక్రమాస్తుల్లో వాటా ఇవ్వాల్సి వస్తుందనే కుట్రతోనే కవితను ఇంటి నుంచి బయటకు పంపారని ఆరోపించారు.
మాగంటి సునీత తరఫున సానుభూతిని కోరడాన్ని ఆయన తప్పుబట్టారు. 2007లో పీజేఆర్ మరణించినప్పుడు సానుభూతికి విరుద్ధంగా అభ్యర్థిని నిలబెట్టింది కేసీఆర్ కాదా? అని ప్రశ్నించారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి హైదరాబాద్ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని, మెట్రో రైలు రెండో దశ, మూసీ నదీ పునరుజ్జీవన ప్రాజెక్టులను అడ్డుకుంటున్నారని ఆరోపించారు. కేంద్ర మంత్రులుగా ఉన్నా తెలంగాణకు ఒక్క రూపాయి నిధులు కూడా తీసుకురాలేకపోయారని విమర్శించారు.
జూబ్లీహిల్స్‌కు సీఎం హామీలు:
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నందున, స్థానిక ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీకి చెందినవారైతేనే నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ విజయం సాధించిన వెంటనే, విజయోత్సవ ర్యాలీకి వచ్చి బోరబండ చౌరస్తాకు ‘పీజేఆర్ బోరబండ చౌరస్తా’గా నామకరణం చేసి, పీజేఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.
జూబ్లీహిల్స్ అభివృద్ధి బాధ్యతను తాను తీసుకుంటానని, అవసరమైన నిధులను విడుదల చేస్తానని తెలిపారు.పట్టాలున్న పేదలకు ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని హామీ ఇచ్చారు. సెకందరాబాద్ కంటోన్మెంట్‌లో కాంగ్రెస్ గెలిచిన తరువాత రూ. 4000 కోట్ల అభివృద్ధి పనులు ఎలా జరిగాయో జూబ్లీహిల్స్‌లో చేసి చూపిస్తామని రేవంత్‌రెడ్డి ఉద్ఘాటించారు.


