Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వేడి మొదలైంది. మరోసారి పీఠం దక్కించుకునేందుకు బీఆర్ఎస్..పట్టు సాధించేందుకు కాంగ్రెస్ పోటీ పడుతున్నాయి. బీజేపీ నామమాత్రం కావడంతో పోటీ ద్విముఖంగా ఉండనుంది. జూబ్లీహిల్స్ బరిలో ఎవరి ఓట్లు ఎన్ని ఉన్నాయి, విజయం ఎవరికి వరించనుందో పక్కా రిపోర్ట్ మీ కోసం…
జూబ్లీహిల్స్ నియోజకవర్గం ప్రొఫైల్
జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఏర్పడిన తరువాత ఇప్పటి వరకు నాలుగు ఎన్నికలు జరిగాయి. గతంలో ఖైరతాబాద్ నియోజకవర్గం పరిధిలో ఉండేది. 2009లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజనతో జూబ్లీహిల్స్ కొత్తగా ఏర్పడింది. 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధి పీ విష్ణువర్ధన్ రెడ్డి విజయం సాధించగా 2014 ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్ధి మాగంటి గోపీనాథ్ గెలిచారు. ఇక 2018 ఎన్నికల్లో మాగంటి గోపీనాథ్..బీఆర్ఎస్ తరపున పోటీ చేసి రెండోసారి విజయం సాధించారు. 2023 ఎన్నికల్లో మరోసారి బీఆర్ఎస్ తరపున పోటీ చేసి గెలుపొందారు.
జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఓటర్ల సంఖ్య, ఎవరి ఓట్లు ఎన్ని
నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య 3 లక్షల 98 వేలు కాగా సరాసరిన 60 శాతం పోలింగ్ నమోదయ్యే పరిస్థితి ఉంది. ఈసారి 65-70 శాతం నమోదయ్యే పరిస్థితి ఉంటుందనేది అంచనా. అంటే ఈసారి 2.30 లక్షల ఓటింగ్ నమోదు కావచ్చని తెలుస్తోంది. జూబ్లీహిల్స్ ఫలితాన్ని నిర్ణయించేది ముస్లిం ఓటర్లే. వీరి సంఖ్య గణనీయంగా 1.12 లక్షలున్నారు. బీసీ ఓటర్ల సంఖ్య 67 వేలు కాగా ఇందులో యాదవ సామాజికవర్గం ఓట్లు 24 వేలున్నాయి. ఎస్సీ సామాజికవర్గం ఓట్లు 44 వేలు కాగా, ఎస్టీ ఓట్లు 38 వేలున్నాయి. ఇక రెడ్డి సామాజికవర్గం నుంచి 50 వేల ఓట్లుంటే కమ్మ సామాజికవర్గం ఓట్లు 80 వేలున్నారు. మొత్తం నియోజకవర్గంలో చిన్న చిన్న బస్తీలు దాదాపుగా 14 ఉంటే..ఈ బస్తీ ఓట్ల సంఖ్య 2 లక్షలుంటుంది.
బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్…ఎవరిది పైచేయి
నియోజకవర్గంపై కచ్చితంగా మాగంటి గోపీనాథ్ కుటుంబం ప్రభావం గట్టిగా ఉంది. అందుకే వరుసగా మూడుసార్లు రెండు పార్టీల తరపున మాగంటి గోపీనాథ్ గెలవగలిగారు. ఇప్పుడు మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఆయన సతీమణి మాగంటి సునీతను బీఆర్ఎస్ బరిలో దింపగా, కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ అభ్యర్ధిత్వాన్ని ఖరారు చేసింది. సానుభూతితో పాటు కాంగ్రెస్ పట్ల సామాన్య, మధ్య తరగతి ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకత, ముస్లిం ఓటర్లు కాంగ్రెస్‌కు దూరం కావడం అనేవి తమకు లాభించవచ్చని బీఆర్ఎస్ పార్టీ అంచనా. అదే సమయంలో సామాన్య ప్రజలు ముఖ్యంగా ముస్లింలకు అన్ని విషయాల్లో చేదోడుగా ఉంటూ వస్తున్న నవీన్ యాదవ్ అభ్యర్ధిత్వంతో పాటు తాము చేపట్టిన సంక్షేమ పధకాలు లాభిస్తాయని కాంగ్రెస్ భావిస్తోంది.
ఎవరు ఎటు వైపు
ఈసారి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో రెడ్డి, కమ్మ సామాజిక వర్గాల ఓటింగ్ బీఆర్ఎస్-కాంగ్రెస్ పార్టీలకు చెరో సగం పడే అవకాశముంది. బీసీ ఓట్లలో అధిక భాగం కాంగ్రెస్‌కు మళ్లవచ్చు. ఇక ఎస్సీ-ఎస్టీ సామాజికవర్గం ఓట్లు కూడా రెండు పార్టీలకు చీలే అవకాశాలున్నాయి. ఇక మిగిలింది గణనీయంగా ఉన్న ముస్లిం సామాజికవర్గ ఓట్లు. ఈసారి ముస్లిం ఓట్లలో అధికభాగం ఎవరికి దక్కితే ఆ పార్టీ విజయం తధ్యం కావచ్చు. ఏదేమైనా జూబ్లీహిల్స్ ఓటింగ్ సరళి పరిశీలిస్తే 70 వేల ఓట్లు ఎవరికి వస్తే ఆ అభ్యర్ధిదే విజయం అవుతుంది. అందుకే ఇప్పుుడు అందరి దృష్టి ముస్లిం సామాజిక ఓట్లపై పడింది.


