Jubilee Hills by-election Congress ticket race : జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక కాంగ్రెస్ పార్టీలో సెగలు పుట్టిస్తోంది. గెలుపు గుర్రం ఎవరనే దానిపై తీవ్రమైన మల్లగుల్లాలు పడుతున్న వేళ, ఆశావహుల సంఖ్య నానాటికీ పెరిగిపోతుండటంతో టికెట్ ఫైట్ ఇప్పుడు ‘గల్లీ నుంచి దిల్లీకి’ చేరింది. కొందరు నేతలు ముఖ్యమంత్రి స్థాయిలో లాబీయింగ్ చేస్తుంటే, మరికొందరు ఏకంగా పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను ప్రసన్నం చేసుకునేందుకు పావులు కదుపుతున్నారు. ఈ నేపథ్యంలో, అసలు జూబ్లీహిల్స్ బరిలో కాంగ్రెస్ తరఫున నిలిచేదెవరు..? అధిష్టానం మదిలో ఉన్న వ్యూహమేమిటి..? అనే ప్రశ్నలు గాంధీ భవన్‌లో హాట్ టాపిక్‌గా మారాయి.
అగ్రనేతల వద్ద అజారుద్దీన్, అంజన్ కుమార్ : గత అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేసి స్వల్ప తేడాతో ఓటమి పాలైన భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహమ్మద్ అజారుద్దీన్, ఈసారి కూడా టికెట్ తనకేనని గట్టి నమ్మకంతో ఉన్నారు. ఆయన ఇటీవలే దిల్లీ వెళ్లి సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో సమావేశమవడం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. మైనారిటీ కోటాలో తనకు టికెట్ కేటాయించాలని ఆయన అగ్రనేతలను అభ్యర్థించినట్లు సమాచారం. గతంలో సొంతంగా అభ్యర్థిత్వాన్ని ప్రకటించుకోవడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేయడంతో, అజారుద్దీన్ ఈసారి తన ప్రయత్నాలను దిల్లీ స్థాయిలో ముమ్మరం చేశారు.
మరోవైపు, కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ కూడా టికెట్ ఆశిస్తున్నారు. ఆయన సైతం ఢిల్లీ వెళ్లి రాహుల్ గాంధీని కలిసి, నేషనల్ హెరాల్డ్ కేసులో పార్టీ కోసం తాను విచారణను ఎదుర్కొన్న విషయాన్ని గుర్తు చేస్తూ, తనకు అవకాశం ఇవ్వాలని కోరినట్లు తెలుస్తోంది. బీసీ సామాజిక వర్గం నుంచి తనకు అవకాశం కల్పించాలని ఆయన కోరుతున్నారు.
బరిలో మేము సైతం అంటున్న నేతలు : ఈ ఇద్దరే కాకుండా, మైనారిటీ కోటాలో టికెట్ ఇస్తే తనకే ఇవ్వాలని మరో నేత ఫిరోజ్ ఖాన్ పట్టుబడుతున్నారు. ఆయన కూడా గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంకోవైపు, నవీన్ యాదవ్ సైతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ద్వారా టికెట్ దక్కించుకోవాలని యత్నిస్తున్నట్లు సమాచారం. జూబ్లీహిల్స్‌లో గెలిచిన అభ్యర్థికి మంత్రివర్గంలో స్థానం లభించే అవకాశం ఉందన్న ప్రచారం ఊపందుకోవడంతో, ఆశావహుల జాబితా మరింత పెరుగుతోంది.
గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ వ్యూహం : గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పార్టీ బలాన్ని పెంచుకోవాలని భావిస్తున్న కాంగ్రెస్ అధిష్టానం, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ ఎన్నికలో గెలుపు బాధ్యతలను ముగ్గురు మంత్రులు – పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, గడ్డం వివేక్‌లకు అప్పగించింది. అంతేకాకుండా, డివిజన్ల వారీగా కార్పొరేషన్ ఛైర్మన్లను కూడా ఇన్‌ఛార్జులుగా నియమించి, పకడ్బందీ వ్యూహరచన చేస్తోంది. స్థానికత, గెలుపు అవకాశాలు, సామాజిక సమీకరణాలు వంటి పలు అంశాలను బేరీజు వేసి అభ్యర్థిని ఎంపిక చేయాలని అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది.
అభ్యర్థి ఎంపికపై కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్‌ఛార్జి దీపాదాస్ మున్షీ, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ త్వరలోనే ఒక నివేదికను అధిష్టానానికి సమర్పించనున్నారు. సర్వేలు, క్షేత్రస్థాయి నివేదికల ఆధారంగా గెలుపు గుర్రాన్నే ఎంపిక చేస్తామని పార్టీ నాయకత్వం స్పష్టం చేస్తోంది. దీంతో, టికెట్ ఎవరికి దక్కుతుందనే ఉత్కంఠ చివరి వరకు కొనసాగే అవకాశం ఉంది.


