Jubilee Hills by election: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం అభ్యర్థిని ఖరారు చేసే ప్రక్రియను టీపీసీసీ వేగవంతం చేసింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సూచనల మేరకు నలుగురు నేతల పేర్లను సోమవారం అఖిల భారత కాంగ్రెస్ కమిటీకి పంపనుంది. ఈ జాబితాలో నవీన్‌యాదవ్, మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, కార్పొరేటర్ సీఎన్ రెడ్డి పేర్లు ఉన్నాయి. నేడో, రేపో వీరిలో ఒకరిని పార్టీ అభ్యర్థిగా ఏఐసీసీ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. నవీన్‌యాదవ్ 2014 అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నుంచి ఎంఐఎం అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఈ నియోజకవర్గంలో ఆయనకు ఓటర్లతో పరిచయాలు ఉన్నాయి. బలమైన సామాజికవర్గానికి చెందిన వ్యక్తి కావడంతో టికెట్ దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
సీఎం రేవంత్ రెడ్డి వ్యూహం: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం అభ్యర్థిని ప్రకటించే అంశంలో రేవంత్ రెడ్డి పక్కా వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు. ఇటీవల బీసీలకు రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతూ జీవో జారీ చేసిన నేపథ్యంలో.. జూబ్లీహిల్స్ టికెట్‌ను కూడా అదే సామాజికవర్గానికి చెందిన నేతకు ఇవ్వాలని రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం ఏఐసీసీని కోరుతున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యూహంలో భాగంగానే గ్రేటర్ హైదరాబాద్‌లో బలమైన బీసీ సామాజికవర్గాల నుంచి ముగ్గురు నేతల పేర్లను ప్రతిపాదించినట్లు సమాచారం.
Also Read:https://teluguprabha.net/telangana-news/today-hearing-on-bc-reservations-go-in-supreme-court/
ఐకమత్యంతో పనిచేయాలని ఆదేశం: నలుగురి పేర్లపై సీఎం రేవంత్‌రెడ్డితో కలిసి ఏఐసీసీ రాష్ట్ర ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ పలు దఫాలు చర్చించారు. నేతల ఆర్థిక, సామాజిక బలాబలాలను బేరీజు వేసిన తర్వాతే ఈ జాబితాను ఖరారు చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. వీరిలో ఎవరికి టికెట్ ఇచ్చినా మిగిలిన నేతలంతా ఐకమత్యంతో పనిచేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ ఉప ఎన్నికలో పార్టీని తప్పనిసరిగా గెలిపించాలని కోరుతూ ఇప్పటికే మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, వివేక్‌లకు సమన్వయ బాధ్యతలను పార్టీ అప్పగించింది. నగర అభివృద్ధికి ప్రభుత్వం అమలుచేస్తున్న కార్యక్రమాలతో ఈ ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలిచి తీరుతుందని నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.


