ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే మొదటిది అయిన జూపాక సమ్మక్క సారలమ్మ జాతర బుధవారం సాయంత్రం ఘనంగా ప్రారంభమైంది. కోరిన కోరికలు తీర్చే వనదేవత సారలమ్మ బుధవారం రాత్రి గద్దెపై కొలువుదీరింది. కమలాపూర్ మండలం భీంపెళ్లి గ్రామ శివారులో ఉన్న గువ్వలగుట్ట నుంచి ప్రధాన సమ్మక్క పూజారి తాటి కృష్ణ , సారలమ్మ ప్రధాన పూజారి తాటి తిరుపతయ్య డప్పు చప్పులతో వాయిద్యాల నృత్యాలతో సుమారు 5 కిలోమీటర్లు దారి పొడువునా మార్మోగిపోయింది.
రాత్రి మొంటె (వెదురు బుట్ట)లో అమ్మవారి ప్రతిరూపమైన పసుపు, కుంకుమలు తీసుకుని పూజారులు బయలుదేరారు. మార్గమధ్యలో ప్రత్యేక పూజలు చేశారు. నడుస్తూ గువ్వల గుట్ట నుంచి 5 కిలోమీటర్ల దూరంలోని జూపాక గద్దెల వద్దకు సారలమ్మను తీసుకొచ్చే అద్భుత సన్నివేశాన్ని కనులారా చూసేందుకు పెద్ద ఎత్తున జనాలు తరలివచ్చారు. సారలమ్మ గద్దెలకు రాక సందర్భంగా పూజారులు చేసే దీవెనలతో భక్తులు దారి పొడవునా ఇరువైపులా ఎదురెళ్లి దండాలు పెట్టారు. డప్పు చప్పులతో, శివసత్తుల పూనకాలతో జూపాక గద్దెకి సారలమ్మ చేరుకుంది.