మాజీ మంత్రి కేటీఆర్(KTR) ఏ తప్పు చేయనప్పుడు కోర్టుకు ఎందుకు వెళ్లారని మంత్రి జూపల్లి కృష్ణారావు(Jupalli Krishna Rao) ప్రశ్నించారు. కేటీఆర్ వేసిన క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసిందని.. ఇప్పటికైనా ఏసీబీ విచారణకు కేటీఆర్ సహకరించాలని సూచించారు. బాన్సువాడలో నిర్వహించిన జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో జూపల్లి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, ఎంపీ సురేష్ శెట్కర్, మున్సిపల్ చైర్మన్ గంగాధర్, కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, కాంగ్రెస్ నాయకులు పోచారం భాస్కర్ రెడ్డి, బాలరాజ్, తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జూపల్లి మాట్లాడుతూ.. ఇప్పటికే బీఆర్ఎస్(BRS) పార్టీ భూస్థాపితం అయిందని విమర్శించారు. ఆ పార్టీ మళ్లీ అధికారంలోకి రావడం అనేది కలగానే మిగిలిపోతుందని జోస్యం చెప్పారు. అధికారం కోల్పోయామనే అక్కసుతో కాంగ్రెస్ ప్రభుత్వంపై బురదజల్లుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో రైతు రుణమాఫీ, మహిళలకు ఉచిత బస్ ప్రయాణం, రూ.500లకే గ్యాస్ సిలిండర్, ప్రతి పేద కుటుంబానికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ పరిమితి పెంపు, ఇందిరమ్మ ఇండ్లు వంటి ఎన్నో పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు.
త్వరలోనే రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద భూమిలేని వ్యవసాయ కూలీలకు ఏడాదికి రూ. 12వేలు సాయం అందజేస్తామన్నారు. గత ప్రభుత్వం రూ.8లక్షల కోట్ల అప్పులు చేసిందని.. అసలు, వడ్డీ కలిపి నెలకు రూ. 6500 కోట్లు చెల్లిస్తున్నామని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం మీద ప్రజలకు నమ్మకం కలిగిందన్నారు. తెలంగాణ రాష్టానికి కాంగ్రెస్ పార్టీ శ్రీరామ రక్ష అని జూపల్లి వెల్లడించారు.