తెలంగాణ రాజకీయాల్లో సంచలన పరిణామం చోటు చేసుకుంది. కాళేశ్వరం (Kaleshwaram) ప్రాజెక్ట్ అవకతవలపై మాజీ సీఎం కేసీఆర్‌కు(KCR) జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఆయనతో పాటు మాజీ మంత్రి హరీశ్‌రావు, బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌కూ నోటీసులు పంపించింది. 15 రోజుల్లో కమిషన్ ఎదుట హాజరుకావాలని పేర్కొంది. కేసీఆర్ జూన్ 5న, హరీశ్‌రావు జూన్ 6న, ఈటల రాజేందర్ జూన్ 9న విచారణకు హాజరుకావాలని ఆదేశించింది.
కాగా బీఆర్ఎస్ హయాంలో కాళేశ్వరం ఎత్తిపోతలలో భాగంగా నిర్మించిన బ్యారేజీలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. నివేదికను జులై 31వ తేదీగా ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ నేపథ్యంలో నోటీసులు జారీ చేయడం సంచలనంగా మారింది. కేసీఆర్ సీఎంగా ఉన్న సమయంలో హరీశ్‌రావు నీటిపారుదల శాఖ మంత్రి, ఈటల రాజేందర్ ఆర్థిక మంత్రిగా పనిచేశారు. ఈ నేపథ్యంలో వారిద్దరికీ కమిషన్ నోటీసులు జారీ చేసింది.