Thursday, September 19, 2024
HomeతెలంగాణJuvvadi: జువ్వాడి అటు వైపా? ఇటు వైపా?

Juvvadi: జువ్వాడి అటు వైపా? ఇటు వైపా?

కోరుట్ల నియోజకవర్గంలో జువ్వాడి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారారు. జువ్వాడి బీజేపీలోకి వెళ్తారన్న ప్రచారం నేపథ్యంలో స్థానికులంతా ఆయన కాంగ్రెస్ లో కొనసాగేది లేనిదీ అన్న విషయంపై హాట్ హాట్ గా చర్చిస్తున్నారు. దివంగత మాజీ మంత్రి జువ్వాడి రత్నాకర్ రావు తనయుడు జువ్వాడి నర్సింగ రావు పొలిటికల్ కెరీర్ నియోజకవర్గంలో హాట్ టాపిక్ గా మారింది. ఆయన కాంగ్రెస్ ను విడుతారని, బీజేపీలో చేరుతారని జోరుగా చర్చ నడుస్తుండగా జువ్వాడి మాత్రం నివురు కప్పిన నిప్పులా ఉన్నారు.

- Advertisement -

గత రెండు ఎన్నికల్లో ఓడిపోయిన ఆయన వచ్చే ఎన్నికల్లో బరిలోకి దిగే ప్రయత్నంలో ఉండగా ఏ పార్టీ తరపున పోటీ చేయాలనే సందిగ్ధంలో ఉన్నట్టు సమాచారం. ప్రస్తుతం రేవంత్ పాదయాత్ర తో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇమేజ్ క్రమంగా పెరుగుతున్నా, పార్టీలో కొనసాగేందుకు చాలా మంది ఇష్టపడటం లేదని, ఇలా

పార్టీని వీడేందుకు సిద్దమైన వారిలో జువ్వాడి ఒకరని నియోజకవర్గంలో ప్రచారం జోరందుకుంది. ఇక బీజేపీ కార్యకర్తలైతే బాహటంగానే నర్సింగరావు తమ పార్టీలోకి వచ్చేస్తున్నారని, తొందరలోనే పార్టీలో చేరబోతున్నారని చెప్పుకుంటుండటం విశేషం.

కాంగ్రెస్ కార్యకర్తలు కూడా నర్సింగా రావు పార్టీ మారుతున్నట్లు చెబుతున్నారు. నియోజకవర్గ కాంగ్రెస్ లో వర్గ పోరు, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చరిష్మా తగ్గిపోతున్న నేపథ్యంలో పార్టీ మారటమే మంచి మార్గమని ఆయనకు సన్నిహితులు చెబుతున్నట్లు సమాచారం. రాష్ట్ర బీజేపీకి చెందిన ఓ కీలక నేత జువ్వాడి విషయంలో చక్రం తిప్పుతూ ఈ మొత్తం వ్యవహారాన్ని నడుపుతున్నట్టు తెలుస్తోంది. వారం రోజుల క్రితం నర్సింగరావు ప్రారంభించిన కన్వెన్షన్ హల్ ప్రారంభోత్సవ కార్యక్రమంకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ హాజరువ్వడంతో ఆయన పార్టీ మారే విషయానికి మరింత బలాన్ని చేకూర్చినట్లు అయ్యింది. వారిద్దరూ కలిసిన ఫోటో సోషల్ మీడియా లో గట్టిగానే చక్కర్లు కొట్టింది. రాష్ట్ర అధినాయకత్వానికి విషయం తెలిసినట్టు సమాచారం. నర్సింగ రావు సన్నిహితులు మాత్రం ఆయన పార్టీ మారరని కరాఖండిగా చెబుతూనే కాంగ్రెస్ టికెట్ పైనే ఆయన పోటీలో ఉంటారని చెబుతున్నారు.

ఒకవేళ ఆయన కాంగ్రెస్ లో కొనసాగితే అంతర్గత వర్గ పోరు, కుమ్ములాటలను ఎలా నెట్టుకొస్తారన్నది ఆసక్తిగా మారింది. కొసమెరుపు ఏంటంటే కొంతకాలంగా పార్టీ మారుతున్నట్టు తనపై ఎన్ని ప్రచారాలు సాగుతున్నా జువ్వాడి మాత్రం స్పందించిందే లేదు. కనీసం తాను పార్టీ మారట్లేదని కూడా ఆయన తన క్యాడర్ కు స్పష్టత ఇవ్వకపోవటంలోని ఆంతర్యం ఏమిటనేది అసలు చర్చనీయాంశంగా మారిందన్నమాట.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News