పార్టీ ఫిరాయింపుల వ్యవహారంపై ఎమ్మెల్యే, మాజీ మంత్రి కడియం శ్రీవారి(Kadiyam Srihari) కీలక వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే అనర్హత పిటిషన్ ప్రస్తుతం సుప్రీంకోర్టు(Supreme Court) పరిధిలో ఉందని.. కోర్టు తీర్పు ఎలా వచ్చినా శిరసా వహిస్తానని స్పష్టం చేశారు. ఒకవేళ ఉప ఎన్నిక వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నానని.. ఎటు పారిపోను అని తేల్చిచెప్పారు. ఫిరాయింపులపై బీఆర్ఎస్ పార్టీకి మాట్లాడే అర్హత లేదని మండిపడ్డారు. గత పది సంవత్సరాల్లో 36 మంది ఇతర పార్టీల ఎమ్మెల్యేను బీఆర్ఎస్ పార్టీలోకి చేర్చుకుని మంత్రి పదవులు కూడా ఇచ్చిందని గుర్తు చేశారు.
బీఆర్ఎస్ నేతలు చేస్తే సంసారం.. తాము చేస్తే వ్యభిచారమా? అంటూ ఘాటు విమర్శలు చేశారు. ఢిల్లీ ఆప్ ఓటమికి బీఆర్ఎస్‌తో స్నేహమే కారణమని ఆరోపించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, ఆప్ కలిసి పోటీ చేస్తే అధికారంలోకి వచ్చేవని కడియం అభిప్రాయపడ్డారు. కాగా ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై సుప్రీంకోర్టులో సోమవారం విచారణ జరగనుంది. దీంతో న్యాయస్థానం తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.