Kaleshwaram Project Information: భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం ప్రాజెక్టు వద్ద వరద ప్రవాహం పూర్తిగా తగ్గుముఖం పట్టింది. రాష్ట్రంలో భారీ వర్షాలు లేకపోవడంతో పాటు.. ఎగువన కూడా వర్షాలు లేకపోవడంతో వరద పూర్తిగా తగ్గినట్లు అధికారులు ప్రకటించారు. ప్రస్తుతం ప్రాజెక్టుకు 90,330 క్యూసెక్కుల వరద ప్రవాహం వస్తుందని.. అంతే మొత్తంలో నీటిని 85 గేట్లు ఓపెన్ చేసి కిందకు విడుదల చేస్తున్నామని అధికారులు ప్రకటించారు. దీంతో ప్రస్తుతం మేడిగడ్డ బ్యారేజ్‌లో ఒక్క చుక్క నీటిని కూడా నిలువ చేయడం లేదని స్పష్టమవుతుంది.
అంతుచిక్కని చర్య..
కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజ్‌లో గల రెండు పిల్లలు కుంగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ బ్యారేజ్‌లో ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం నీటిని నిలపడం లేదు. పైగా ఈ బ్యారేజ్ విషయమై ఓ కమిటీని ఏర్పాటు చేయగా.. ఆ కమిటీ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగిందని ఓ నివేదికను సమర్పించింది. ఈ విషయంపై తెలంగాణలో రాజకీయం వాడి వేడిగా సాగుతుండగా.. ఇప్పుడు వరద ప్రభావం లేకపోయినప్పటికీ.. ప్రాజెక్టు నుంచి నీటిని కిందకు వదిలేయడంపై తెలంగాణ ప్రజలకు అంతుచిక్కని ప్రశ్నగా మారింది. వరద ప్రభావం లేనప్పటికీ ఉన్న నీటిని కిందకు వదిలేయడం ఎందుకని కొందరు ప్రశ్నిస్తున్నారు. తక్కువ మొత్తంలోనైనా నీటిని ఒడిసిపట్టి.. కొంతమంది రైతులకు అయినా ఆ నీటిని సాగు కోసం సరఫరా చేయొచ్చు కదా అని చెబుతున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం దీనికి భిన్నంగా స్పందించడం అంతుచిక్కని చర్యగా మారింది.
కాళేశ్వరం పనికిరాదా?
వేల కోట్ల ప్రజాధనంతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ప్రస్తుత రాజకీయ క్రీడలో ఎటూ పనికిరాకుండా పోయింది. ఓ పక్క సాగు కోసం నీళ్లు లేక.. ఉన్న బోర్లు ఎండిపోవడంతో ప్రజలు బిక్కు బిక్కుమంటుంటే.. మరోపక్క తమ తమ రాజకీయ అవసరాల కోసం రాజకీయ పార్టీలు ఆ ప్రాజెక్టును కీలు బొమ్మలా మార్చేస్తున్నాయి. వేల కోట్లు వెచ్చించి కట్టిన ప్రాజెక్టు కనీసం 30% మంది రైతులకు కూడా వినియోగానికి రాదా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ.. రాష్ట్ర ప్రభుత్వానికి అత్యంత ముఖ్యమైన చర్య రైతులకు సాగు నీటిని అందించడం. వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో.. ఉన్న నీటితోనే కొంతమంది రైతులను అయినా ఆదుకోవాలని తెలంగాణం కోరుకుంటోంది. మరి దీనిపై ప్రభుత్వం, ప్రజలు ఏ విధంగా స్పందింస్తుందో చూడాలి. ఏ విధంగా స్పందించినా.. రైతులకు మాత్రం న్యాయం జరిగేలా చూడాలని కోరుకుంటున్నారు. అలాగే వ్యవసాయాన్ని నమ్ముకున్న అన్నదాతను ఆదుకోవాలని చెబుతున్నారు.


