Wednesday, June 11, 2025
HomeతెలంగాణKCR: రేపే విచారణ.. మాజీ సీఎం కేసీఆర్‌తో హరీశ్ రావు మరోసారి భేటీ

KCR: రేపే విచారణ.. మాజీ సీఎం కేసీఆర్‌తో హరీశ్ రావు మరోసారి భేటీ

కాళేశ్వరం కమిషన్(Kaleshwaram Commission)విచారణకు హాజరైన మాజీ మంత్రి హరీశ్ రావు(Harish rao) ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్(KCR)తో మరోసారి భేటీ అయ్యారు. కమిషన్ విచారణ అనంతరం సోమవారం మధ్యాహ్నం కేసీఆర్‌తో హరీశ్ రావు భేటీ అయిన సంగతి తెలిసిందే. సుమారు మూడు గంటల పాటు సాగిన ఈ సమావేశంలో కమిషన్ అడిగిన ప్రశ్నలు, ఇచ్చిన సమాధానాలు కేసీఆర్‌కు వివరించినట్లు సమాచారం. ఇవాళ మరోసారి హరీశ్ రావు కేసీఆర్‌తో భేటీ అయి కమిషన్ విచారణ తీరును వివరిస్తున్నట్లు తెలుస్తోంది.

బుధవారం ఉదయం కాళేశ్వరం కమిషన్ ముందు విచారణకు కేసీఆర్ హాజరుకావాల్సి ఉంది. విచారణ సందర్భంగా కమిషన్‌కు అందించాల్సిన డాక్యుమెంట్స్ ను ఇప్పటికే సిద్ధం చేశారట. అంతేకాకుండా కాళేశ్వరం ప్రాజెక్టుపై కమిషన్ ముందు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చే యోచనలో కేసీఆర్ ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో కేసీఆర్ తో హరీశ్ రావు సుదీర్ఘంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.

మరోవైపు కాళేశ్వరం కమిషన్ విచారణకు కేసీఆర్ హాజరుకానున్న నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ భవన్‌లో ముఖ్యనాయకులతో సమావేశమయ్యారు. తెలంగాణ భవన్ నుంచి విచారణ జరిగే బీఆర్కే భవన్ దాకా కేసీఆర్ కు మద్దతుగా భారీ సంఖ్యలో గులాబీ శ్రేణులు తరలివెళ్లేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ మేరకు ఇప్పటికే ప్రణాళికలు రూపొందించినట్లు తెలుస్తోంది. హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డితో పాటు వివిధ జిల్లాల నుంచి కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున తెలంగాణ భవన్ కు తరలిరావాలని పిలుపునిచ్చారు.

కాగా కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందంటూ కాంగ్రెస్ ప్రభుత్వం జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ను నియమించిన విషయం విధితమే. విచారణలో భాగంగా ఈ కమిషన్ అప్పటి సీఎం కేసీఆర్, నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ రావు, ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ కు నోటీసులు అందించింది. ఈ నేపథ్యంలో జూన్ 6న ఈటల, జూన్ 9న హరీశ్ కమిషన్ ముందుకు విచారణకు హాజరయ్యారు. రేపు కేసీఆర్ హాజరుకానున్నారు. కేసీఆర్ హాజరు నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు చర్యలు చేపడుతున్నారు. కేసీఆర్ విచారణ అనంతరం కమిషన్ ప్రభుత్వానికి తుది నివేదిక ఇవ్వనుంది. ఈ నివేదిక ఆధారంగా ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకోనుంది.


సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News