Thursday, July 10, 2025
HomeతెలంగాణKalvakuntla Kavitha: సింగరేణి జాగృతి రైల్ రోకో పోస్టర్ ఆవిష్కరించిన కవిత.. బీసీ రిజర్వేషన్లపై కీలక...

Kalvakuntla Kavitha: సింగరేణి జాగృతి రైల్ రోకో పోస్టర్ ఆవిష్కరించిన కవిత.. బీసీ రిజర్వేషన్లపై కీలక వ్యాఖ్యలు

Rail Roko: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఈ మధ్య కాలంలో రాజకీయాల పరంగా చాలా చురుగ్గా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై పోరాటం కొనసాగిస్తున్నారు. అందులో భాగంగానే బీసీల హక్కుల కోసం సాగుతున్న పోరాటానికి మద్దతుగా, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు మరియు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కీలక ప్రకటన చేశారు. జూలై 17న యునైటెడ్ ఫూలే ఫ్రంట్ (UPF) పిలుపును అనుసరిస్తూ.. తలపెట్టిన “రైల్ రోకో” కార్యక్రమానికి సంఘీభావంగా, సోమవారం తన నివాసంలో సింగరేణి జాగృతి రూపొందించిన ప్రచార పోస్టర్‌ను ఆవిష్కరించారు.

- Advertisement -

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బీసీ సమాజానికి విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించాల్సిన అవసరం ఎంతగానో ఉందని స్పష్టం చేశారు. అసెంబ్లీ మరియు కౌన్సిల్‌లో బీసీ రిజర్వేషన్ల కోసం ఇప్పటికే రెండు వేర్వేరు బిల్లులు ఆమోదించబడినా, వాటికి చట్టబద్ధ స్థిరత కల్పించేందుకు ప్రభుత్వం గట్టి ప్రయత్నాలు చేయడంలేదని ఆమె విమర్శించారు.

“ఒక్కసారి బిల్లులు పాస్ చేయడమే కాదు, వాటిని చట్టంగా అమలు చేయాలంటే కేంద్రంపై ఒత్తిడి అవసరం. కానీ ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లే ప్రయత్నం కూడా చేయలేదు,” అంటూ ఆమె మండిపడ్డారు. ఈ నేపథ్యంలోనే, జూలై 17న చేపట్టే రైల్ రోకోకు తెలంగాణ జాగృతి, యూపీఎఫ్‌తో కలిసి పాల్గొంటుందని పేర్కొన్నారు. ఎన్నికలకు ముందే బీసీ రిజర్వేషన్లు తేల్చకుండా, స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిపేందుకు కుట్ర జరుగుతోందని ఆమె ఆరోపించారు. రాజకీయ పార్టీల పంచాయితీ కంటే, బీసీలకు చట్టబద్ధమైన రిజర్వేషన్‌ను కల్పించడం ముఖ్యం అని స్పష్టం చేశారు.

“ఈ రైల్ రోకో గళం బలంగా వినిపించాల్సిందే. ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఈ ఉద్యమాన్ని మేము ముందుకు తీసుకెళ్తాం,” అని కవిత స్పష్టం చేశారు. సింగరేణి జాగృతి కూడా ఈ కార్యక్రమానికి పూర్తి మద్దతు ప్రకటించిందని, బీసీ రిజర్వేషన్ల అంశాన్ని ప్రజల మధ్య విస్తృతంగా చర్చకు తెచ్చే ప్రయత్నం చేస్తామని తెలిపారు. జూలై 16, 17, 18 తేదీల్లో రైల్ రోకో ప్రభావం ఉండే అవకాశముందని, ఆ రోజుల్లో అవసరాలుంటే ప్రయాణాలు మానుకోవాలని కవిత ప్రజలకు సూచించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News