Jagriti Janam Bata Program: ‘జాగృతి జనం బాట’యాత్రలో కల్వకుంట్ల కవిత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గత 20 ఏళ్లుగా కేసీఆర్, భారత రాష్ట్రసమితి పార్టీ కోసం పని చేశానని అన్నారు. కానీ అనివార్య కారణాలతో నా తొవ్వ నేను వెతుక్కోవాల్సి వచ్చిందని అన్నారు. అందుకే జనం బాట పట్టానని తెలిపారు. నిజామాబాద్‌లో తాను ఓటమి పాలవ్వడం వెనుక కుట్ర ఉందో లేదో బీఆర్ఎస్ కార్యకర్తలు ఆలోచించాలన్నారు. కుట్ర చేసి నన్ను బయటకి పంపించారని తెలిపారు. ఇప్పుడు నా దారి నేను వెతుక్కుంటున్నానని అన్నారు.
మనస్పర్థలను పక్కనపెట్టి కలిసిరండి: సామాజిక తెలంగాణ సాధనే లక్ష్యంగా తాను ఈ పర్యటనకు బయలుదేరానని కవిత స్పష్టం చేశారు. అందరి కోసం సామాజిక తెలంగాణ రావాలనేదే తన లక్ష్యమన్నారు. ప్రతి ఒక్కరికీ అన్ని రంగాల్లో సమాన అవకాశాలు రావాలని తెలిపారు. అగ్రవర్ణాల్లోనూ అన్ని కులాలకు రాజకీయ ప్రాతినిధ్యం లేదని తెలిపారు. అన్ని వర్గాలు కలిసి ఉంటేనే సమాజం బాగుంటుది కవిత స్పష్టం చేశారు. గతంలో జాగృతిలో పనిచేసిన వారంతా మనస్పర్థలను పక్కనపెట్టి మళ్లీ కలిసి పనిచేయాలని కవిత కోరారు. ఆత్మగౌరవంతో కూడిన తెలంగాణ సాధనే లక్ష్యంగా జనం బాట పట్టినట్టుగా తెలిపారు. రాష్ట్రంలో ఎక్కడ ఏ సమస్య వచ్చినా .. అక్కడికి వెళ్లి పోరాటం చేస్తానని కవిత స్పష్టం చేశారు.
తక్షణమే కోటి రూపాయల పరిహారం ఇవ్వాలి: ‘జాగృతి జనం బాట’ పేరుతో 33 జిల్లాలు, 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటించేందుకు కవిత శనివారం నిజామాబాద్ బయలుదేరారు. అంతకుముందు అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించిన ఆమె.. తెలంగాణ ఉద్యమంలో సుమారు 1200 మంది అమరులైన అంశాన్ని గుర్తు చేశారు. గత ప్రభుత్వంతో పాటు రెవంత్ రెడ్డి సర్కార్ అమరుల కుటుంబాలకు పూర్తిస్థాయిలో న్యాయం చేయలేకపోయామన్నారు. ‘కేవలం 500 మంది అమరవీరుల కుటుంబాలకు మాత్రమే ఉద్యోగాలు వచ్చాయని తెలిపారు. ఉద్యమకారులకు దక్కాల్సిన న్యాయం జరగలేదని.. కవిత ఆవేదన వ్యక్తం చేశారు. ఎంపీగా అమరవీరుల కుటుంబాలకు న్యాయం జరగాలని బీఆర్ఎస్ పార్టీ అంతర్గత వేదికల్లో పదే పదే అడిగినట్లు కల్వకుంట్ల కవిత చెప్పారు. అయినప్పటికీ.. ఉద్యమకారులకు న్యాయం చేయలేకపోయనని అన్నారు. ఇప్పటికైనా అమరవీరుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే కోటి రూపాయల పరిహారం ఇవ్వాలని కవిత డిమాండ్ చేశారు.


