Kalvakuntla Kavitha’s political career: తెలంగాణ రాజకీయాల్లో ఇటీవల కవిత తీసుకుంటున్న చర్యలు ఆసక్తికరంగా మారాయి. రోజు రోజుకూ ఆమె రాజకీయ దృష్టికోణం ఎలా మారుతోందనే దానిపై ఆసక్తికర చర్చకు దారి తీస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీలో తనకు మద్దతు లేదన్న భావనతో కేసీఆర్ సహాయం కోసం కొంతకాలం నిరీక్షించారు. కానీ పార్టీ కార్యకలాపాల్లో తన పాత్ర మరింత తగ్గిపోవడం, ముఖ్యంగా తన సోదరుడు కేటీఆర్ నాయకత్వానికి కేసీఆర్ ప్రాధాన్యం ఇవ్వడంతో ఆమె నిరాశకు గురైనట్లు తెలుస్తోంది. దీంతో ఆమె జాగృతి పేరుతో రాజకీయాలు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ పరిణామాల నేపథ్యంలో కవిత తిరిగి తెలంగాణ జాగృతి సంస్థను ఆధారంగా చేసుకుని తన రాజకీయ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. గతంలో TRS (ప్రస్తుత BRS) ఉద్యమంలో కీలకంగా పనిచేసిన ఈ సంస్థను ఆమె ఇప్పుడు భారత జాగృతిగా విస్తరించారు. అయితే తాజా పరిణామాలతో తెలంగాణ పేరు మీదే సంస్థ కార్యకలాపాలను తిరిగి చురుకుగా నిర్వహించడం గమనార్హం.
హైదరాబాద్‌లో ఇటీవల నిర్వహించిన “లీడర్” అనే రాజకీయ శిక్షణ శిబిరంలో కవిత మాట్లాడుతూ, పదునైన విమర్శలు ఎలా చేయాలో నేర్చుకోవాలి అని నేతలకు సూచించారు. వ్యక్తిగత దూషణలకు దూరంగా ఉండాలని, విషయపరంగా ఎదుగుదల సాధించాలన్నది ఆమె సందేశం. ఈ కార్యక్రమంలో ఆమె తండ్రి కేసీఆర్ పేరు ప్రస్తావించకపోవడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.
కేసీఆర్‌కు విముఖత?
పూర్తిగా కుటుంబ ఆధారిత పార్టీగా భావించబడుతున్న BRSలో, కవితకు పెద్దగా ప్రాధాన్యం లేకుండా పోయిందన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఈ సందర్భంలో కవిత జాగృతి కార్యక్రమాల్లో గాంధీ, అంబేద్కర్ వంటి నేతల పేర్లను ప్రస్తావించగా, కేసీఆర్ పేరు మాత్రం పూర్తిగా మౌనంగా ఉండడం, వారి మధ్య పెరుగుతున్న దూరాన్ని సూచిస్తోంది. అంతేకాదు, కార్యక్రమ బ్యానర్లలో కేసీఆర్ ఫోటో ఒక మూలగా ఉండగా, ప్రధానంగా కనిపించకపోవడం కూడా మారుతున్న వైఖరికి సంకేతంగా చెబుతున్నారు. ఇది భావితరాల నేతగా కవిత తన బ్రాండ్‌ను కొత్తగా నిలబెట్టుకోవాలనే ప్రయత్నంగా విశ్లేషకులు చూస్తున్నారు.
కొత్త పార్టీ సూచనలు?
ఆమె రాజకీయ వైఖరి, మాటల తీరుతో కొత్త పార్టీ ఆలోచనల వైపు కదులుతున్నారేమో అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇప్పుడున్న రాజకీయ వాతావరణంలో బీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయంగా తెలంగాణ ప్రజల మనసు దోచేలా ఒక కొత్త పార్టీ స్థాపించే అవకాశాలపై పరిశీలన జరుగుతోంది. ఇందులో తెలంగాణ జాగృతి ఓ పునాదిగా మారవచ్చని భావిస్తున్నారు.
తెలంగాణ సంస్కృతి మీద కవిత ఫోకస్
కవిత తెలంగాణ భాష, యాస, జానపద కళలు, పండుగల పరిరక్షణ కోసం గత 19 ఏళ్లుగా జాగృతిగా ఉన్నామని, ఉద్యమ కాలంలో తెలంగాణను అవమానించిన వారి వ్యవహారాన్ని ఎత్తిచూపుతూ, ఆంధ్ర రాష్ట్ర సినీప్రభుత్వం ఇచ్చిన అవార్డుపై కూడా నిరసన తెలిపిన విషయాలను గుర్తు చేశారు. తెలంగాణ హక్కులను పరిరక్షించాలన్నది తమ ముఖ్య లక్ష్యమని, జాగృతి సంస్థదే అసలైన తెలంగాణ ధోరణి అని అన్నారు.
కవిత నెమ్మదిగా తన స్వంత రాజకీయ వేదికను ఏర్పాటుచేసుకుంటున్నారన్న సంకేతాలు ఇవ్వడం ప్రారంభించారు. కుటుంబ రాజకీయాలకు దూరంగా, జాతీయ స్థాయిలో తెలంగాణ గొంతును వినిపించాలన్న లక్ష్యంతో ఆమె ముందుకు వెళ్తున్నట్లు కనిపిస్తోంది. కొత్త పార్టీ పుట్టుక తలుపుతడుతుందా? లేక జాగృతి ఆధారంగా రాజకీయంగా కొత్త ప్రయోగం జరుగుతుందా? అన్నది రానున్న రోజుల్లో తేలనుంది. ఈ మార్పుల పట్ల BRS ఎలా స్పందిస్తుందో, కేటీఆర్, కవిత మధ్య రాజకీయ బలాబలాలు ఎలా మారతాయో, రాష్ట్ర రాజకీయాలపై దాని ప్రభావం ఎంత ఉండబోతుందో వేచి చూడాలి.


