jagruthi janam bata: జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తండ్రి కేసీఆర్, అన్న కేటీఆర్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు కనీసం షోకాజ్ నోటీస్ ఇవ్వకుండా పార్టీ నుంచి సస్పెండ్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆడబిడ్డ రాజకీయం చేస్తే తట్టుకోలేకే తనను పార్టీ నుంచి సస్పెండ్ చేశారని.. కేసీఆర్‌పై సంచలన ఆరోపణలు చేశారు. తనది వెనక్కి తగ్గే వ్యక్తిత్వం కాదని కవిత పేర్కొంది. పాలిటిక్స్ పక్కా చేస్తానని తెలిపింది. ఆడబిడ్డలు రాజకీయం చేస్తే ఎలా ఉంటుందో చూపిస్తానంటూ కవిత వరంగల్ ప్రెస్ క్లబ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
కేసీఆర్ తండ్రిగా పిలిస్తే వెళ్తా: రాజకీయాలు వేరు రక్త సంబంధం వేరని కల్వకుంట్ల కవిత అన్నారు. కేసీఆర్ తండ్రిగా పిలిస్తే.. కూతురుగా వెళ్లేందుకు సిద్ధమని కవిత అన్నారు. అయితే రాజకీయంగా వెళ్లే పరిస్థితి ఇక లేదని తెలిపారు. బీఆర్ఎస్‌లో నన్ను ప్రోటోకాల్ పేరుతో నిజామాబాద్‌కే కట్టడి చేశారని ఆరోపించారు. ఇప్పుడు తనకు స్వేఛ్చ ఉందని తెలిపారు. ఇప్పటినుంచి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో తిరిగి ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని అన్నారు.
సామాజిక తెలంగాణే లక్ష్యం: జాగృతి జనం బాట పేరుతో కల్వకుంట్ల కవిత చేపట్టిన జిల్లాల యాత్రలో వరంగల్‌కు చేరుకుంది. సామాజిక తెలంగాణ అంటే నినాదం కాదు విధానమని ఆమె అన్నారు. తాను ఉన్నన్ని రోజులు సామాజిక తెలంగాణ కోసం పనిచేస్తామని స్పష్టం చేశారు. అంతే కాకుండా ప్రజల సమస్యలపై నిత్యం పోరాటం చేస్తానని పేర్కొన్నారు. ఆడబిడ్డలు రాజకీయం చేస్తే ఎలా ఉంటుందో యావత్ సమాజానికి చూపిస్తనని తెలిపారు. అయితే ఇప్పుడు రాజకీయాలు చేసే సమయం కాదని అన్నారు. ఇప్పుడు కేవలం ప్రజా సమస్యలపై మాత్రమే పోరాటం చేస్తానని అన్నారు. ఎన్నికలకు ముందు ఏడాది మాత్రమే తాను రాజకీయాలు చేస్తానని అన్నారు.
Also Read:https://teluguprabha.net/telangana-news/kcr-campaign-in-jubilee-hills-by-election/
జాగృతి సంస్థకు ఆయనే స్ఫూర్తి: తెలంగాణ ఉద్యమంలో వరంగల్ జిల్లా పాత్ర మరువలేనిదని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. ఈ జిల్లా ఉద్యమానికి ఎంతో స్ఫూర్తినిచ్చిందని తెలిపారు. వరంగల్ అనగానే ప్రొఫెసర్ జయశంకర్ సార్ గుర్తుకు వస్తారని అన్నారు. జాగృతి సంస్థకు ఆయనే స్ఫూర్తి అని తెలిపారు. రాజులకు, రాజ్యాలకు భయపడే రక్తం తెలంగాణది కాదని అన్నారు. బమ్మెర పోతన గారు అప్పటి రాజు రాజరాజనరేంద్రుడికి తాను రాసిన వాటిని అంకితమివ్వాలంటే అందుకు ససేమిరా అన్న అంశాన్ని గుర్తు చేశారు. మహిళ అంటే అబల కాదు సబల అని నిరూపించిన గొప్ప వీరనారి రాణి రుద్రమ దేవి అని కవిత అన్నారు.


