ప్రొఫెసర్ కంచె ఐలయ్య(Kancha Ilaiah) మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈసారి ఆయన దేవుళ్ల గురించి వివాదాస్పదంగా మాట్లాడారు. మహబుబాబాద్ జిల్లా గూడురులో దొడ్డి కొమరయ్య విగ్రహావిలష్కరణకు ముఖ్య అతిథిగా ఐలయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా ఐలయ్య మాట్లాడుతూ.. మహిళా విశ్వవిద్యాలయానికి తెలంగాణ ప్రభుత్వం చాకలి ఐలమ్మ పేరు పెట్టడం తప్పేమీ కాదన్నారు. ఆమె ఓ వీర వనిత అని, యోధురాలని కొనియాడారు. ఐలమ్మ బట్టలు ఉతికి సమాజాన్ని శుద్ధి చేశారని పేర్కొన్నారు.
ఇదే సమయంలో యూనివర్సిటీలకు దేవుళ్ల పేర్లు పెట్టడం ఎందుకని ప్రశ్నించారు. తిరుమల వెంకటేశ్వర స్వామి, పద్మావతి అమ్మవారికి ఏమైనా చదువు వచ్చా? అని వ్యాఖ్యానించారు. దీంతో ఐలయ్య వ్యాఖ్యలపై హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. ఆయన తక్షణమే తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుని క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా తిరుపతిలో శ్రీ వెంకటేశ్వరస్వామి యూనివర్సిటీ, పద్మావతి మహిళా యూనివర్సిటీలు ఉన్న సంగతి తెలిసిందే.