గూడ్స్ , ఇతర భారీ వాహనాలు ట్రాఫిక్ ప్రవాహానికి తీవ్ర అసౌకర్యాన్ని కలిగిస్తున్నాయని సాధారణ ట్రాఫిక్ సమయాల్లో ఇతర రహదారి వినియోగదారులకు కూడా ప్రమాదాన్ని కలిగిస్తున్నాయని, కరీంనగర్ నగరంలో పెద్ద సంఖ్యలో పాఠశాలలు, కళాశాలలు, వాణిజ్య సంస్థలు, ప్రభుత్వ సంస్థలు, ఇతర సంస్థలు ఉన్నందున సాధారణ ట్రాఫిక్ సమయాల్లో వాహనాల రాకపోకలు , పాదచారుల రాకపోకలు చాలా ఎక్కువగా ఉంటాయని అందువలన ప్రజల భద్రత సౌలభ్యం దృష్ట్యా అటువంటి సమయాల్లో భారీ వాహనాల రాకపోకలను నియంత్రించాల్సిన అవసరం ఎంతైనా ఉందని కరీంనగర్ పోలీస్ కమిషనర్ అభిషేక్ మొహంతి పేర్కొన్నారు.
గత కొన్ని సంవత్సరాలుగా కరీంనగర్ కమిషనరేట్‌లో అన్ని కోణాల్లో విస్తరిస్తూ అభివృద్ధి చెందుతున్న ఫలితంగా వాహనాల సంఖ్య ప్రజల రాకపోకలు భారీగా పెరిగాయి. కమిషనరేట్ పరిధిలో వాణిజ్య కార్యకలాపాలు, నివాస ప్రాంతాలు, పారిశ్రామిక కార్యకలాపాలు, విద్యా రంగం, ఉపాధి రంగం మొదలైన వాటిలో పెద్ద ఎత్తున వృద్ధి కనిపించడం వల్ల రోడ్ నెట్‌వర్క్ మరియు ఇతర ట్రాఫిక్ మౌలిక సదుపాయాలపై ఒత్తిడి కూడా పెరిగిందన్నారు. గూడ్స్/ట్రాన్స్‌పోర్ట్ వాహనాల రాకపోకల ఫలితంగా ట్రాఫిక్ మరియు రోడ్డు భద్రతా సిబ్బందికి ట్రాఫిక్‌ను నియంత్రించడం, రహదారి భద్రత కోసం చేపట్టే చర్యలను అమలు చేయడం భారీ సవాలుగా మారిందన్నారు.
కొన్ని రహదారులపై ట్రాఫిక్ రద్దీ, భారీ వాహనాల నిలుపుదల కారణంగా కరీంనగర్‌లోని వివిధ రహదారులపై అనేక ప్రమాదాలు నమోదవుతుండటం కారణంగా ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని గతంలోనే రెగ్యులేటరీ ఉత్తర్వులు జారీ చేశామని పేర్కొన్నారు.
పరిస్థితిని ఇంకా మెరుగుపరచడానికి, గత నోటిఫికేషన్‌లు/ఆర్డర్‌లలో వున్న లోటు పాట్లు ప్రస్తుత పరిస్థితుల అనుకూలంగా ట్రాఫిక్ నియంత్రించడానికి ఇతర శాఖల అధికారులు, సంబంధిత వాటాదారులతో తగిన చర్చలు సంప్రదింపుల చేశామని ప్రస్తుత పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని ప్రజల భద్రత, ట్రాఫిక్ నిర్వహణ దృష్ట్యా, కొన్ని పరిమితులు విధించాల్సిన అవసరం ఉందని పోలీస్ కమిషనర్ పేర్కొన్నారు.
లా & ఆర్డర్/ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల పరిధిలో ట్రాఫిక్ పీక్ అవర్స్ ఉదయం 08.00 గంటల నుండి రాత్రి 10:00 గంటల మధ్య డి.వి.ఎం లు, ఐషర్ వ్యాన్‌లు, వాటర్ ట్యాంకర్లు, అర్. సి.ఎం లు, రాకెట్ లారీలు, జే. సి.బి లు, ఎర్త్ మూవర్ , ట్రాక్టర్లు, భారీ మోటార్ వాహనాలు & మీడియం మోటారు వాహనాలకు పరిమితులు విధించబడినవి.
పరిమితులను ఉల్లంఘించి పట్టుబడిన వారిపై హైదరాబాద్ సిటీ పోలీస్ యాక్ట్, మోటార్ వెహీకల్ చట్టం , ఇతర చట్టాల సంబంధిత నిబంధనల ప్రకారం చర్యలు చేపడతామని కరీంనగర్ పోలీస్ కమిషనర్ అభిషేక్ మొహంతి తెలిపారు.